విజయవాడలో వేంకటేశ్వరుడికి వీడిన చెర.. మంత్రి లోకేష్‌ చొరవతో నల్లూరి వారి తోట ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ-end of captivity for venkateswara in vijayawada endowment department takes over nalluri garden temple ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విజయవాడలో వేంకటేశ్వరుడికి వీడిన చెర.. మంత్రి లోకేష్‌ చొరవతో నల్లూరి వారి తోట ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ

విజయవాడలో వేంకటేశ్వరుడికి వీడిన చెర.. మంత్రి లోకేష్‌ చొరవతో నల్లూరి వారి తోట ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ

Sarath Chandra.B HT Telugu

విజయవాడ పటమటలో ఉన్న నల్లూరి వారి ధర్మతోటలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి 20ఏళ్ల తర్వాత విముక్తి లభించింది. దాతల ఆశయాలకు విరుద్ధంగా స్వామి సొమ్మును ఏళ్ల తరబడి అనుభవిస్తున్న వారి చెర నుంచి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.మంత్రి లోకేష్‌ చొరవతో దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది.

నల్లూరి వారి ధర్మతోట ఆలయాన్ని స్వాధీనం చేసుకుంటున్న దేవాదాయ శాఖ అధికారులు

ఆలయాల్లో నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దానం చేసిన భూములతో ట్రస్టీలు సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని హిందుస్థాన్‌ టైమ్స్‌ గత ఏప్రిల్‌లో వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వాన్ని మభ్య పెట్టేలా దేవాదాయ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరును బయట పెట్టింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ అక్రమార్కులకు సహకరిస్తున్న వైనాన్ని ఎండగట్టింది.

ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్‌‌కు అర్చకులు ఫిర్యాదు చేయడంతో దేవాదాయ శాఖ దర్యాప్తుకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ను సైతం ఏమార్చేందుకు ప్రయత్నాలు జరిగినా.. భవిష్యత్తులో కోర్టులో దోషులుగా నిలబడాల్సి వస్తుందనే కారణంతో ఎట్టకేలకు ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. పూర్తి స్థాయి ఈవోను నియమించారు.

ఆలయ భూములతో ఆర్జన..

హిందూ ధర్మ పరిరక్షణ, అధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాల్లో ధూపదీప నైవేధ్యాల కోసం దాన పత్రాలతో దానం చేసిన భూములు పరాధీనమవుతున్న వైనాన్ని గత ఏప్రిల్‌లో హెచ్‌టి వెలుగులోకి తెచ్చింది. విజయవాడ నగరంలో కోట్లాది రుపాయల ఖరీదు చేసే దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతమైన వైనం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. దేవుడికి చెందాల్సిన ఆదాయాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్న వారికి దేవాదాయ శాఖ అధికారులు అండగా నిలుస్తూ వచ్చారు.

విజయవాడ పటమటలో నల్లూరి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలను, వాటి భూములను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు 2022లో తీర్పునిచ్చినా అధికారులు పట్టించుకోని వైనం విజయవాడలో కొద్ది నెలల క్రితం బయట పడింది. ఈ ఆలయాల నిర్వహణపై 2006నుంచి ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ పలుకుబడి, స్థాన బలం, దౌర్జన్యాలతో ఆలయ ఆదాయం పక్కదారి పడుతూ వచ్చింది.

దాతల విరాళాలతో నిర్మించిన ఆలయం, కళ్యాణ మండపాలను భూమిని ఇచ్చిన దాతల వారసులు స్వాధీనం చేసుకోవడంపై 20 ఏళ్లుగా అర్చకులు పోరాటం చేస్తున్నారు.2022లో ఆలయ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును దేవాదాయ శాఖ అధికారులు అమలు చేయలేదు. రిజిస్ట్రర్డ్‌ దాన పత్రాల ద్వారా దేవాదాయ శాఖకు సంక్రమించిన భూముల్లో అనధికారికంగా జరుగుతున్న వ్యాపారాలకు అండగా నిలిచారు.

స్వామి వారి ఆభరణాలు లెక్కిస్తున్న దేవాదాయ శాఖ అధికారులు
స్వామి వారి ఆభరణాలు లెక్కిస్తున్న దేవాదాయ శాఖ అధికారులు

నాడు దాతృత్వం.. నేడు వ్యాపారం..

విజయవాడ పటమటలో ఉన్న నల్లూరి వారి ధర్మతోట 1950కు ముందే ఏర్పడింది. ఈ భూమిలో 94 సెంట్ల భూమిని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి ధర్మకర్తలు రిజిస్ట్రేషన్ చేశారు.1979లో నల్లూరి వారి ధర్మతోటలో ఉన్న 94 సెంట్ల భూమిలో దాతల సహకారంతో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, కళ్యాణమండపం, షాపులను నిర్మించారు. ఆలయ నిర్మాణానికి ఎంతోమంది విరాళాలు ఇచ్చారు.

ప్రస్తుతం కళ్యాణ మండపంలో శుభకార్యాలకు రోజుకు రూ.లక్షన్నర వరకు అద్దె వసూలు చేస్తున్నట్టు ఆలయ వర్గాలు చెబుతున్నాయి.ఈ డబ్బంతా దేవుడికి చెందాల్సి ఉండగా ట్రస్టీల వారసులు వాటిని పొందుతున్నారు. చివరకు స్వామి వారి కళ్యాణోత్సవాల నిర్వహణను కూడా విరాళాల మీద నిర్వహించాల్సిన పరిస్థితి కల్పించారు.

ఏటా 2-3 కోట్ల రుపాయల ఆదాయం కళ్యాణ మండపం ద్వారా సమకూరుతున్న ఆలయ నిర్వహణకు మాత్రం భక్తులపై ఆధార పడాల్సిన పరిస్థితి కల్పించారు. ప్రస్తుతం దేవాలయానికి, ఆలయ కమిటీకి సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి నిర్వహణ వెళ్లిపోయినట్టు ఆలయ ప్రధాన అర్చకుడు కసుమూరి రాజగోపాలాచార్యులు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు.

20ఏళ్ల క్రితమే దేవాదాయ శాఖ పరిధిలోకి...

2004లోనే నల్లూరి వారి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణపై వివాదం తలెత్తడంతో సెక్షన్ 43 ప్రకారం ఆలయంతో పాటు, ఫంక్షన్ హాల్‌, దుకాణాలు ఉన్న 94 సెంట్లను దేవాదాయ శాఖకు చెందినవిగా ఖరారు చేస్తూ దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ట్రస్టీల్లో ఒకరైన బసవశంకరరావు స్వయంగా దేవాదాయశాఖకు చెందేలా ఆలయ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్‌ చేయించారు.

ఆ తర్వాత కూడా ఆలయ రికార్డులను, ఆస్తులను స్వాధీనం చేసుకోకుండా వదిలేశారు. దేవాదాయ శాఖకు చెందిన ఆలయంతో పాటు ఫంక్షన్‌ హాల్ 20ఏళ్లుగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉండిపోయింది. ఆలయానికి వస్తున్న ఆదాయానికి లెక్కజమ లేకుండా పోయింది.

దేవాదాయ శాఖ నిర్లక్ష్యంపై పోరాటం..

నల్లూరి వారి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ ఆలయాలను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలంటూ 2022లో ఆలయ అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బి. కృష్ణమోహన్ నేతృత్వంలోని ధర్మాసనం వెంకటేశ్వర స్వామి ఆలయం, కళ్యాణమండపం, దుకాణాలను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.

ఆ తర్వాత కూడా కోర్టు తీర్పు అమలు కాకపోవడంతో అర్చకులు పలు మార్లు దేవాదాయ శాఖకు ఫిర్యాదులు చేశారు. 2025 జనవరి 8వ తేదీలోపు ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంటున్నట్టు ఫిర్యాదుదారులకు చెప్పినా అది అమలు కాలేదు. హైకోర్టులో దాఖలైన రిట్‌పిటిషన్‌ 1384/2022పై ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆలయ రికార్డులను స్వాధీనం చేయాలని ట్రస్టీలకు ఆదేశించినట్టు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ అర్చకులకు రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు.

మంత్రి లోకేష్‌ చొరవతో...

విజయవాడ పటమటలోని నల్లూరి ధర్మతోటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉండటంపై ఆలయ అర్చకులు మంత్రి నారా లోకేష్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. శ్రీవెంకటేశ‌్వర స్వామి దేవాలయ ధర్మకర్తల సంఘంపై విచారణ జరపాలని అభ్యర్థించారు.దీనిపై విచారణ జరపాలని దేవాదాయ శాఖను మంత్రి ఆదేశించడంతో ఈ వ్యవహారంలో కదలిక వచ్చింది.

ఈ క్రమంలో నల్లూరి వారి ధర్మతోట భూములపై పిటిషన్లు విచారణలో ఉన్నాయంటూ గ్రీవెన్స్‌ ముగించే ప్రయత్నాలు జరిగాయి. దేవాదాయ శాఖ అధికారులు ఏకపక్షంగా గ్రీవెన్స్‌ ముగించినట్టు జిల్లా కలెక్టర్‌కు అర్చకులు ఫిర్యాదు చేయడంతో దేవాదాయ శాఖ అధికారులు ఇరుక్కుపోయారు. విధిలేని పరిస్థితుల్లో గత వారం ఆలయాన్ని, స్వామి వారి ఆభరణాలను, హుండీలను స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణమండపం విషయంలో మాత్రం తాత్సారం చేశారు.

హైకోర్టు విచారణ భయంతో…

త్వరలో హైకోర్టులో విచారణ జరుగనుండటం, మంత్రి నారా లోకేష్‌ కార్యాలయం నేరుగా పర్యవేక్షించడంతో దేవాదాయ శాఖ అధికారులు రెండు రోజుల క్రితం సెక్షన్‌ 43కు అనుగుణంగా వెంకటేశ‌్వర స్వామి ఆలయం, ఆంజనేయ ఆలయం, కళ్యాణమండపం, దుకాణాలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నారు. ఆలయానికి ఈవోగా వెంకటరెడ్డిని నియమించారు.

ఆలయానికి వచ్చే విరాళాలు, ఫంక్షన్ హాల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వేర్వేరు ఖాతాల్లో ప్రభుత్వం నిర్వహించాలని ఆలయ ప్రధాన అర్చకుడు కసుమూరి రాజగోపాలాచార్యులు మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేశారు.లోకేష్‌ చొరవతో 20ఏళ్ల సమస్యకు పరిష్కారంలభించడంపై ఆలయ వ్యవస్థాపకులు, అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న వేంకటేశ్వర ఆలయం
దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న వేంకటేశ్వర ఆలయం

ఆలయ ఆదాయంపై వారి కన్ను...

నల్లూరి వారి ధర్మతోటలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం దుకాణాలు, రెండు అంతస్తుల్లో ఉన్న కళ్యాణ మండపం, లైటింగ్‌ రూమ్‌, కొబ్బరి చిప్పల సేకరణ కోసం దేవాదాయశాఖ వేలం ప్రకటన విడుదల చేసింది.ఏటా కోట్లాది రుపాయల ఆదాయం వచ్చే ఆస్తులు కావడంతో వాటిని దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతాయని దాతలు అనుమానిస్తున్నారు.

20ఏళ్లుగా ఆలయ ఆదాయానికి లెక్కా పత్రాలు లేవని, ఇన్నాళ్లు వచ్చిన ఆదాయాన్ని ఏదో రూపంలో దక్కించుకునే ప్రయత్నాలు చేస్తారని చెబుతున్నారు. స్వామి వారి సొమ్ము దేవుడికి మాత్రమే దక్కేలా ప్రభుత్వ పర్యవేక్షణ ఉంచాలని, వేలం రూపంలో ఆదాయం తగ్గించేందుకు చేసే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం