అన్నీ సవ్యంగా జరిగి నిర్మాణంలో ఉన్న టెర్మినల్ భవనం సకాలంలో పూర్తయితే.. ఈ ఏడాదే గన్నవరం విమానాశ్రయం నుంచి.. పలు కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా విజయవాడ - దుబాయ్ మధ్య డైరెక్ట్ ఫైట్ స్టార్ట్ కానుంది. ఇందుకు సంబంధించి సాంకేతిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్.. విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న సాంకేతిక సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసింది.
అయితే.. గన్నవరం విమానాశ్రయానకి ప్రధాన లోపం ఉంది. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ నుండి నేరుగా విమానం ఎక్కడానికి వీలు కల్పించే ఏరోబ్రిడ్జి లేదు. దీనిపై విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. "ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం సాంకేతిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనాన్ని నిర్వహించింది. విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న సాంకేతిక సౌకర్యాలను పరిశీలించింది. రన్‌వే పొడవు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్, ఇతర సేవలపై ఎమిరేట్స్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కానీ ప్రత్యేక ఏరోబ్రిడ్జి లేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు" అని లక్ష్మికాంత్ రెడ్డి వివరించారు.
"ఎమిరేట్స్, ఒక అధునాతన అంతర్జాతీయ విమానయాన సంస్థ. ఎల్లప్పుడూ తన కస్టమర్లకు ఉత్తమ ప్రయాణ సేవలను అందించడానికి ప్రయత్నిస్తుంది. ఏరోబ్రిడ్జి కోసం ఈ బృందం పట్టుబట్టింది. ఎందుకంటే వారు తమ ప్రయాణికులను ఏ విమానాశ్రయంలోనైనా.. విమాన నిచ్చెనను ఉపయోగించి ఎక్కడానికి లేదా దిగడానికి అనుమతించరు" అని విమానాశ్రయ డైరెక్టర్ చెప్పారు.
అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్త టెర్మినల్ భవనంలో ఆరు ఏరోబ్రిడ్జిలు ఉన్నాయి. "కొత్త టెర్మినల్ భవనంలో ఆరు ఏరోబ్రిడ్జిలు ఉంటాయి. నాలుగు దేశీయ విమానాలకు సేవలు అందిస్తాయి. రెండు అంతర్జాతీయ విమానాలకు ప్రత్యేకంగా ఉంటాయి. రన్‌వేపై ఒకేసారి ఆరు విమానాలను డాక్ చేయడానికి వీలు కల్పిస్తాయి" అని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వివరించారు.
ఈ ఏరోబ్రిడ్జిలు పూర్తయిన తర్వాత.. అంతర్జాతీయ క్యారియర్లు కార్యకలాపాలను ప్రారంభించడానికి వీలు ఉంటుంది. అయితే.. ప్రతిపాదిత విజయవాడ- దుబాయ్ మార్గంలో ప్రయాణికుల డిమాండ్‌ను అంచనా వేయడం, ఇంకా కొన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొత్త టెర్మినల్ ప్రధాన కార్యాలయానికి సంబంధించి 70 శాతం సిమెంట్ పని పూర్తయింది. మరో 30 శాతం జరగాల్సి ఉంది. బేస్‌మెంట్, ఒకటి, రెండో అంతస్తులకు సంబంధించిన పిల్లర్లు, శ్లాబులు పూర్తయ్యాయి.
కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తయ్యాక.. లోపల తుదిదశ పనులకే నెలల సమయం పడుతుంది. 24 చెక్‌ఇన్ కౌంటర్లు, 14 ఇమిగ్రేషన్, 4 కస్టమ్స్ కౌంటర్లు, డిపార్చర్, అరైవల్ బ్లాకుల్లో బ్యాగేజీ కన్వేయర్లు, అంతర్జాతీయ స్థాయి బ్యాగేజీ హ్యాండ్లింగ్ వ్యవస్థ, సెంట్రల్ ఏసీ, 24 గంటలూ సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్‌లైన్స్ సంస్థల కార్యాలయాలు, బుకింగ్ కౌంటర్లు, లాంజ్‌లు.. ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కనీసం 6 నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు.