Eluru Railway Station : వేగంగా అభివృద్ధి పనులు.. ఏలూరు రైల్వేస్టేషన్‌‌కు కొత్త రూపు!-eluru railway station development work is progressing rapidly ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Eluru Railway Station : వేగంగా అభివృద్ధి పనులు.. ఏలూరు రైల్వేస్టేషన్‌‌కు కొత్త రూపు!

Eluru Railway Station : వేగంగా అభివృద్ధి పనులు.. ఏలూరు రైల్వేస్టేషన్‌‌కు కొత్త రూపు!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 08, 2025 11:26 AM IST

Eluru Railway Station : ఏలూరు రైల్వే స్టేషన్.. విజయవాడ- రాజమండ్రి మధ్యలో కీలకంగా ఉంటుంది. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణం సాగిస్తున్నా.. అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్రం నిధులు కేటాయించినా.. పనులు సరిగా జరగలేదు. అటు అధికారులు, ఇటు నాయకుల చొరవతో ప్రస్తుతం పనులు పరుగులు పెడుతున్నాయి.

ఏలూరు రైల్వేస్టేషన్‌‌
ఏలూరు రైల్వేస్టేషన్‌‌

ఏలూరు రైల్వే స్టేషన్ దశాబ్దాల కిందట ఏర్పాటైంది. కానీ.. అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. ఫలితంగా సమస్యలకు నిలయంగా పేరు సంపాదించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో.. ఏలూరు రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంటోంది. దీనికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. అభివృద్ధి పనులపై అటు రైల్వే శాఖ ఉన్నతాధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు ఫోకస్ పెట్టారు.

ఏడాది కిందట..

ఎంపిక చేసిన రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులను ఏడాది కిందట చేపట్టారు. దీంట్లో భాగంగా.. ఏలూరు స్టేషన్‌ ఆధునికీకరణ పనులను గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రారంభించారు. ఏలూరు రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు కేంద్రం రూ.21 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో తొలి విడతగా స్టేషన్‌లో సదుపాయాల కల్పన, నిర్ణీత నమూనాలో ఎలివేషన్‌ పనులు చేస్తున్నారు. దీంతోపాటు ప్లాట్‌ఫాంలు ఆధునికీకరిస్తున్నారు.

అధికారుల చొరవతో..

రెండో దశలో ఎస్కలేటర్‌ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం స్టేషన్‌ లోపల ఉన్న పార్సిల్‌ కార్యాలయాన్ని తొలగిస్తున్నారు. స్టేషన్ సమీప ఖాళీ స్థలంలోకి దీన్ని మార్చనున్నారు. అటు అలంకార ప్రాయంగా ఉన్న ఒకటో ప్లాట్‌ఫాంను కూడా వినియోగంలోకి తీసుకొచ్చేలా పనులు చేపడుతున్నారు. మొదట్లో పనులు పెద్దగా జరగలేదు. కానీ.. ఇటీవల ఉన్నతాధికారుల చొరవతో ఊపందుకున్నాయి.

ఎంపీ మహేష్ హామీ..

విజయవాడ డీఆర్‌ఎం, ఇతర ఉన్నతాధికారులు ఇటీవల స్టేషన్‌ను తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యతను పరిశీలించారు. మొదటి దశ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఇటు ఎంపీ మహేష్ యాదవ్ కూడా స్టేషన్‌ను సందర్శించి ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని.. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

నిత్యం 8 వేల మంది..

ఏలూరు రైల్వేస్టేషన్‌ నుంచి నిత్యం దాదాపు 8 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. విజయవాడ డివిజన్‌ పరిధిలో స్టేషన్‌ స్థాయిని అనుసరించి.. ఎన్‌ఎస్‌జీ వారు మూడో గ్రేడ్ కేటాయించారు. తొలి రెండు స్థానాల్లో విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం చేపట్టిన పనులు పూర్తయితే.. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Whats_app_banner