Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా అత్యాచారానికి సంబంధించిన వీడియోలున్నాయంటూ బెదిరించి అతడి ఇద్దరు స్నేహితులు కూడా ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ప్రశ్నిస్తే, వారిని కూడా బెదిరించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులు, వారితో సంబంధమున్న నలుగురిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ ఘటన ఏలూరు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఏలూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరులోని జేపీ నగర్‌కు చెందిన ఆళ్ల వంశీకృష్ణ అనే యువకుడు, ఏలూరులోని ఒక ప్రాంతానికి చెందిన ఓ బాలిక వెంటపడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. అలా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అయితే తమ వద్ద తన స్నేహితుడు అత్యాచారం చేసిన వీడియోలు తమ వద్ద ఉన్నాయంటూ వంశీ కృష్ణ స్నేహితులు సాయి చరణ్, చిట్టూరి శివశంకర్‌లు బెదిరింపులకు దిగారు.
తమతో శారీరక సంబంధం పెట్టుకోకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో ఆ బాలిక తీవ్రంగా బాధపడుతూ నిరాశతో ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆరా తీశారు. బాలిక ఏడ్చుకుంటూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. కుమార్తె పడుతున్న బాధను తల్లిదండ్రులు చూడలేకపోయారు. ఆ దుర్మార్గులను ప్రశ్నించారు. అయితే బాలిక తల్లిదండ్రులను కూడా యువకులు బెదిరించారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక ..తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరిస్తూ పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేసింది.
బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం రాత్రి ఏలూరు మూడో పట్టణ పోలీసులు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితులైన ఆళ్ల వంశీకృష్ణ, సాయి చరణ్, చిట్టూరి శివశంకర్‌లతో పాటు ఈ కేసుతో సంబంధమున్న రాయి విజయ్, రాయి పావని, యానాదుల సింహాద్రి, కార్తిక్‌లపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఆరేళ్ల బాలికపై మారతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఏలూరు పట్టణానికి చెందిన మహిళకు భర్త చనిపోవడంతో ఆమె కాకినాడకు చెందిన పోతుల వంశీ మోహన్ కుమార్ రెండే పెళ్లి చేసుకుంది. అయితే ఆమెకు మొదటి భర్తకు పుట్టిన ఆరేళ్ల బాలికపై వంశీ మోహన్ కుమార్ కన్నేశాడు. ఆ చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రెండో భర్త అమానవీయ చర్యలను భార్య గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో ఆయన పరారీలో ఉన్నారు. చిన్నారి మారుతండ్రిపై ఏలూరు మహిళ పోలీస్ స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు వంశీమోహన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ప్రక్రియ మొత్తం పూర్తి చేసి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. అతడికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోలీసులు కేసు విచారణను కొనసాగిస్తున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం