Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిల ఐదుగురుగు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో గాయపడిన వారు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓబులవారిపల్లె మండలం గుండాల కోనలో ఉన్న శివాలయానికి శివరాత్రి సందర్భంగా భక్తులు తరలి వెళుతుంటారు. సోమవారం రాత్రి 14మంది భక్తుల బృందం గుండాలకోనకు అటవీ మార్గంలో కాలినడకన వెళ్లారు. ఈ క్రమంలో ఏనుగుల మంద భక్తులపై దాడి చేశాయి.
శివరాత్రి సందర్భంగా వై కోటకు చెందిన భక్తులు గుండాల కోన ఆలయానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయానికి సమీపంలోనే భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఏనుగుల దాడిలో గాయపడిన వారిలో ఇద్దరిని తిరుపతి తరలించారు. గుండాల కోన నుంచి తలకోన వెళుతుండగా ఏనుగులు దాడి చేశాయి. దాడి నుంచి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. మునెమ్మ, చెంగల్రాయుడు, బుజ్జి అనే వారు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను వేగంగా బయటకు తీసుకు వచ్చినా మృతదేహాలను తరలించడంలో జాప్యం జరిగింది.
గుండాలకోనలో ఉన్న మల్లేశ్వరాలయంలో మహాశివరాత్రిని స్థానిక ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. మంగళవారం ఐదు వేల మందికి అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయానికి వెళుతున్న వారిపై ఏనుగులు దాడి చేశాయి.
మృతి చెందిన వారిని రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తరచూ ఏనుగుల దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తెచ్చేందుకు గత ఏడాది ఒప్పందం చేసుకున్నారు. కుంకీ ఏనుగులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో తరచూ ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి.
అన్నమయ్య జిల్లా గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం నుంచి ఘటన వివరాలు తెలుసుకున్నారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.మృతుల కుటుంబాలకి రూ.10 లక్షలు, క్షతగాత్రులకి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు దిశానిర్దేశం చేశారు.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన ఆలయం వద్ద ఏనుగుల దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే దాడిలో మరికొందరు గాయపడిన ఘటనపై సిఎం విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిఎం అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సిఎం ప్రకటించారు.
పార్వతీపురం జిల్లాలో కూడా ఏనుగులు బీభత్సం సృష్టించాయి.ఏజెన్సీ ప్రాంతంలో నివాస ప్రాంతాల్లోకి చొరబడి ఇళ్లను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో నష్టం వివరాలు తెలియాల్సా ఉంది.
సంబంధిత కథనం