Electricity Charges: ఎలక్షన్ ఎఫెక్ట్‌…! ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు లేదు… పాత టారిఫ్ వసూలుకు నిర్ణయం-election effect no increase in electricity charges this year ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Electricity Charges: ఎలక్షన్ ఎఫెక్ట్‌…! ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు లేదు… పాత టారిఫ్ వసూలుకు నిర్ణయం

Electricity Charges: ఎలక్షన్ ఎఫెక్ట్‌…! ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు లేదు… పాత టారిఫ్ వసూలుకు నిర్ణయం

Sarath chandra.B HT Telugu
Mar 11, 2024 06:17 PM IST

Electricity Charges: ఏపీలో విద్యుత్‌ వినియోగదారులకు గొప్ప ఊరట ఇచ్చే నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. విద్యుత్‌ చార్జీ పెంపుదల లేదని విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించింది. గత ఏడాది ఛార్జీలనే ఈ ఏడాది కూడా కొనసాగించనున్నారు.

ఏపీలో వార్షిక విద్యుత్ ఛార్జీలను ప్రకటిస్తున్న ఈఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి
ఏపీలో వార్షిక విద్యుత్ ఛార్జీలను ప్రకటిస్తున్న ఈఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి

Electricity Charges: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ వినియోగదారులకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి APERC తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ప్రకటించింది.

yearly horoscope entry point

గతేడాది వసూలు చేసిన ఛార్జీలే ఈ ఏడాది కూడా వర్తిస్తాయని ఏపీ ఈఆర్‌సి ఛైర్మన్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే ప్రజలపై అదనపు భారంగా పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024-2025 ఏడాదికి టారిఫ్ రూపకల్పన చేశారు.

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి ఛార్జీల భారం లేకుండా కొత్త టారిఫ్ ను రూపొందించినట్టు ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి Justice CB Nagarjuna Reddy ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్‌ను సోమవారం జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి విడుదల చేశారు.చట్టప్రకారం టారిఫ్ Tariff రూపకల్పన జరిగిందని, ఇందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు, సూచనలు కూడా స్వీకరించామన్నారు.

ఇంధన ధరల అంచనాలకు, వాస్తవికతకు తేడా ఉంటుందని, అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వార్షిక ఆదాయ అవసరాల నిమిత్తం ఎస్పీడీసీఎల్ SPDCL, సీపీడీసీఎల్ CPDCL, ఈపీడీసీఎల్ EPDCL డిస్కమ్‌లు రూ.56,573.03 కోట్లకు ప్రతిపాదనలు పంపగా రూ.56,501.81 కోట్లకు కమిషన్ ఆమోదం తెలిపిందన్నారు.

వార్షిక ఆదాయ అంతరం నిమిత్తం ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ డిస్కమ్‌లు Discoms రూ.13,624.67 కోట్లు ప్రతిపాదించగా రూ.15,299.18 కోట్లకు కమిషన్ ఆమోదించిందన్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఈ మూడు డిస్కమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,589.18 కోట్ల మేర సబ్సిడీ అందించనుందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సబ్సిడీ క్రింద రూ.3,453.96 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుందన్నారు

రిటైల్ సరఫరా ధరలు….

రైల్వే ట్రాక్షన్ కు మినహా మరే ఇతర వర్గానికి ఛార్జీల పెంపు లేదన్నారు. ప్రస్తుత ఏడాది రూ.10,135.22 కోట్ల సబ్సిడీతో పోలిస్తే, రాబోయే సంవత్సరానికి మొత్తం రూ.13,589.18 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో తద్వారా పంపిణీ సంస్థల ఆదాయ లోటును పూడ్చుకోవడానికి మరియు వినియోగదారులపై ఛార్జీలను పెంచాల్సిన అవసరాన్ని నివారించడంలో ప్రభుత్వం ఎంతో సహకరించిందన్నారు.

ప్రభుత్వ నిర్ణయం విద్యుత్ ధరలతో వినియోగదారులపై ఆర్థిక భారాన్ని మరింత తగ్గించడానికి సహాయపడుతుందని తెలిపారు. 2020-21 నుండి రైల్వే ట్రాక్షన్ కు టారిఫ్ లో పెంపుదల లేనందున, వాస్తవ సేవా ఖర్చు మరియు ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించేలా ఇంధన ఛార్జీలు యూనిట్ కు రూ.5.50 నుండి రూ.6.50కి పెంచినట్టు చెప్పారు జరిగిందన్నారు.

సగ్గు బియ్యం తయారీ మిల్లులకు, పౌల్ట్రీ ప్లాంట్లకు విద్యుత్ నియంత్రణ కమిషన్ కొంత మేర ఉపశమనం కలిగించిందని, సగ్గు బియ్యం మిల్లులను సీజనల్ పరిశ్రమల విభాగంలో చేర్చినట్టు చెప్పారు. పౌల్ట్రీ కార్యకలాపాలకు అనుబంధంగా ఉన్న వారి కార్యాలయం మరియు సిబ్బంది క్వార్టర్స్ వినియోగాన్ని పరిగణించడానికి మొత్తం వినియోగంలో 5 శాతం బిల్లింగ్ వరకు పౌల్ట్రీ కేటగిరి క్రిందనే అనుమతించనున్నట్టు వివరించారు.

కమిషన్ ప్రకటించిన ఈ వెసులుబాటు వలన విద్యుత్ వాడకం దుర్వినియోగాల కింద డీపీఈ/ విజిలెన్స్ కేసులను బుక్ చేయడం నుండి వారికి ఉపశమనం లభిస్తుందన్నారు. ఏపీటెల్ (APTEL) ఉత్తర్వుల ప్రకారం గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు క్యాప్టివ్ విద్యుత్ కేంద్రాలలో స్థానికంగా ఉన్న లోడ్ వరకు మాత్రమే పరిమితం చేయబడ్డాయన్నారు.

విద్యుత్ చట్టం 2003 మరియు ఇంధన పరిరక్షణ చట్టం సవరణల ప్రకారం ఏ వినియోగదారుడికి ఎలాంటి అవాంతరాలు లేకుండా నేరుగా డిస్కమ్ నుండి గ్రీన్ ఎనర్జీని సేకరించేందుకు వీలుగా కేటగిరీ టారిఫ్ పై గ్రీన్ టారిఫ్ ప్రీమియం ను, రూ.0.75/యూనిట్ గా నిర్ణయించామన్నారు.

విద్యుత్ వాహన ఛార్జింగ్ స్టేషన్లకు, డిస్కమ్‌లు అందించే విద్యుత్ రేటును విద్యుత్ సేవా ఖర్చు (కాస్ట్ ఆఫ్ సర్వీస్) స్థాయికి పెంచాలని డిస్కంలు చేసిన ప్రతిపాదన ఆమోదించలేదని, విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు వాటి టారిఫ్ ను యధాతథంగా డిమాండ్ ఛార్జీలు లేకుండా, యూనిట్ కు రూ.6.70గా నిర్దేశించామని చెప్పారు.

ఉచిత వ్యవసాయ విద్యుత్ కేటగిరీ కింద, ఫీడర్ వారీ వ్యవసాయ విక్రయాలను వారి వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలని డిస్కమ్‌లను కమిషన్ ఆదేశించిందన్నారు. వ్యవసాయ వినియోగదారులకు సబ్సీడీ చెల్లింపు ఆలస్యమయ్యే అంశాల్లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ (MOP) జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను డిస్కమ్‌లు అనుసరించాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవించాలని అభ్యర్థించినట్టు జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి తెలిపారు.

Whats_app_banner