Janasena : జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్
Janasena : జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. దీంతో గాజు గ్లాస్ సింబల్ ను ఇకపై జనసేనకు మాత్రమే కేటాయించనున్నారు. ఈ మేరకు ఈసీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేఖ రాసింది.
Janasena : జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీకి ఈసీ గుర్తింపు లభించింది. దీంతో గాజు గ్లాసు గుర్తును ఈసీ రిజర్వ్ చేసింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. దీంతో ఈసీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనకు చోటు దక్కింది. ఇప్పటి వరకూ రిజిస్టర్డ్ పార్టీగానే జనసేనకు గుర్తింపు ఉంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు రిజిస్టర్డ్ పార్టీ హోదాలోనే జనసేన పోటీ చేసింది.
జనసేన అభ్యర్థన మేరకు ఎన్నికల సమయంలో గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే గాజు గ్లాస్ సింబల్ జనసేనకు కేటాయించారు, మిగిలిన నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టిన విషయం తెలిందే. అయితే తాజాగా జనసేనకు ఈసీ గుర్తింపు రావడంతో ఇకపై గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీకి మాత్రమే కేటాయించనున్నారు.
జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్ సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన గుర్తింపు పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకొంది.
"సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆశయంతో మార్చి 14, 2014న జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ సంకల్పం, దశాబ్ద కాల అలుపెరగని పోరాటం, లక్షలాది మంది జనసైనికుల శ్రమకు ఫలితంగా, 100 శాతం స్ట్రైక్ రేట్ తో చారిత్రక విజయంతో రాజకీయ చరిత్రలో పెను సంచలనం సృష్టించిన జనసేన పార్టీ, నేడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన శుభ సందర్భంలో, ప్రతీ జనసైనికుడికి, వీరమహిళకు, నాయకులకు హృదయపూర్వక అభినందనలు" అని జనసేన ట్వీట్ చేసింది.
సంబంధిత కథనం