రాష్ట్రంలో ఈకేవైసీ నమోదు నత్తడకన జరుగుతోంది. తీవ్రమైన ఎండలో బారులు తీరిన క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ఈకేవైసీ నమోదుకు ఇంకా మూడు రోజులే ఉండటంతో గ్రామం, పట్టణం, నగరం అని తేడా లేకుండా ఇదే దృశ్యాలు కనబడుతున్నాయి. ఈకేవైసీ నమోదుతో ప్రజలు ఇక్కట్లు అన్నీ ఇన్నీ కాదు. హెచ్‌టీ తెలుగు ప్రతినిధి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు అనేక దృశ్యాలు కనిపించాయి.
1. రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ ఇచ్చింది. రేషన్ కార్డుదారులందరికి ఈకేవైసీ నమోదు, అప్‌డేట్‌ను తప్పనిసరి చేసింది. మార్చి నెలాఖరులోగా ఈకేవైసీ చేసుకోకపోతే, వచ్చే నెలల నుంచి రేషన్ బంద్ కానుంది. కనుక ఈనెలాఖరులోగా ఈకేవైసీ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం (జీఎస్‌డబ్ల్యూఎస్) మొబైల్ యాప్, ఎఫ్‌పీ షాపుల్లో ఈ-పోస్ పరికరాల ద్వారా ఈకేవైసీ అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించామని తెలిపింది.
2. క్షేత్రస్థాయిల్లో మాత్రం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈకేవైసీ జరగడం లేదు. అక్కడికి వెళ్లిన కార్డుదారులను ఈకేవైసీ రేషన్ డీలర్ల చేస్తారని వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో ప్రజలు అక్కడికి, ఇక్కడికి అని తిరగలేకపోతున్నారు. తీరా రేషన్ దుకాణాల వద్దకు వెళ్తే బారులు తీరిన క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు.
3. తీవ్రమైన ఎండలో క్యూలైన్లలో ఉండి ఈకేవైసీ చేసుకునేందుకు ప్రజలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కాదు. మర్చి నుంచి వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది. ప్రజలు బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
4. మధ్యాహ్న సమయంలో (ఎండ ఎక్కువగా ఉండే సమయంలో) ప్రజలు బయటకు వెళ్ళకుండా ఉండడం, తరచుగా నీరు త్రాగడం, మజ్జిగ, గ్లూకోజు, నిమ్మరసం, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్, పండ్ల రసాలు, తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలని ఏపీఎస్‌డీఎంఏ పేర్కొంటుంది. తలకు టోపీ పెట్టుకోవడం లేదా గొడుగు వాడడం చేయాలని, డీ-హైడ్రేషన్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
5. ఈకేవైసీ నమోదు చేసుకునే ప్రజలకు వీటన్నింటికీ దూరంగా ఉంటున్నారు. మండుటెండలో గంటలతరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. అక్కడ కనీసం త్రాగునీరు కూడా అందించిన నాధుడే లేడు. నీడ కోసం కనీసం టెంట్ కూడా వేయలేదు. గంటల తరబడి వృద్ధులు, చిన్నారులు క్యూలైన్లలో ఎండలో నిలబడి ఉంటున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే, గంటల తరబడి ఉన్నప్పటికీ, వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తోంది.
6. ప్రజలకు ఈకేవైసీ అయిందో, కాలేదో ముందు తెలియటం లేదు. దీంతో అందరూ క్యూలైన్లలో ఉంటున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో ఉండి, తీరా ఈకేవైసీ నమోదు చేసే సమయంలో అప్పటికే ఈకేవైసీ నమోదు అయినట్లు మిషన్ చూపుతోంది. దీంతో వృధాగా గంటల పాటు ఎండలో వేచి ఉండాల్సి వస్తుంది. పనులు మానుకోని, ఈకేవైసీ నమోదు కోసం పడరానిపాట్లు పడుతున్నామని ప్రజలు అంటున్నారు. కనుక అప్పటికే ఈకేవైసీ అయిందా? లేదా? అనే చెక్ చేసుకునే యంత్రంగాన్ని ప్రభుత్వం తీసుకురావాలని అడుగుతున్నారు.
7. మరోవైపు రేషన్ డీలర్ల వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యల వల్ల ఈకేవైసీ నమోదు ప్రక్రియ నత్తనడకగా సాగుతోంది. ఈకేవైసీ నమోదును పర్యవేక్షించే వారు కూడా కరువైయ్యారు. జిల్లా, మండల పౌర సరఫరాల అధికారులను పదో తరగతి పరీక్షల విధులకు కేటాయించడంతో ఈకేవైసీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నమోదులో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు తగిన యంత్రాంగం లేదు.
8. ఇంకా మూడు రోజులే ఉండటంతో పూర్తి స్థాయిలో ఈకేవైసీ పూర్తి చేయడం సాధ్యం కాదు. కనుక ఈకేవైసీ నమోదు ప్రక్రియ గడువును పొడిగించాలని సీపీఎం కోరుతోంది. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పది రోజుల్లో ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రకటిస్తే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాలు రెండు మూడు నెలల ముందు నుంచి చేస్తే, ప్రజలకు, సిబ్బందికి ఎటువంటి సమస్యలు రావని అన్నారు. ఇప్పుడు ఒకపక్క తీవ్రమైన ఉష్టోగ్రతలతో ప్రజలు మండుటెండలో పడిగాపులు కాయడం, మరోవైపు ఈకేవైసీ నమోదు చేసే సిబ్బందికి ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
9. ఈకేవైసీ నమోదు సమయంలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. కూలీ నాలీ చేసుకునే తాము కూలీ పనులు మానుకోని గంటల తరబడి ఇక్కడ ఉంటున్నామని అంటున్నారు. పనులను వదులుకొని ఈకేవైసీ నమోదు కోసం వేచి చూస్తున్నామని మధ్యతరగతి వర్గాల ప్రజలు చెబుతున్నారు. గతంలో ఈ సమస్య రాలేదని…. వాలంటీర్లే తమ ఇంటి వద్దకు వచ్చి ఇలాంటి పనులు చేసి పెట్టేవారని తెలిపారు.
10. ఈకేవైసీ నమోదు కేంద్రం (రేషన్ షాప్) వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సాంకేతి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలని కోరుతున్నారు. గ్రామ సచివాలయాల్లోనూ ఈకేవైసీ నమోదును చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఈకేవైసీ నమోదు నత్తనడకగా సాగుతోంది. మరోవైపు రేషన్ డీలర్లు కూడా తమ సమస్యలు చెబుతున్నారు. ఈకేవైసీ నమోదులో సాంకేతిక సమస్యలతో జాప్యం జరుగుతోందని అంటున్నారు. ఇప్పటికీ దాదాపుగా 50 శాతం వరకు మాత్రమే ఈకేవైసీ నమోదు పూర్తి అయిందని రేషన్ డీలర్లు చెబుతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు దీనిపై ఆలోచనలు చేయాలని కోరుతున్నారు.