MLA Quota MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్.. ఏపీలో 7, తెలంగాణలో 3 !-eci releases schedule for mla quota mlc elections in ap and telangana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Eci Releases Schedule For Mla Quota Mlc Elections In Ap And Telangana

MLA Quota MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్.. ఏపీలో 7, తెలంగాణలో 3 !

HT Telugu Desk HT Telugu
Feb 27, 2023 06:50 PM IST

MLA Quota MLC Elections : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో త్వరలో ఖాళీ అవుతోన్న ఎమ్మెల్యే కోటాలోని 10 శాసన మండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలోని 7 స్థానాలకు అధికార వైఎస్సార్సీపీ ఇప్పటికే అభ్యర్థులని ప్రకటించగా... తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపికపై ఆసక్తి నెలకొంది.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్

MLA Quota MLC Elections : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో త్వరలో ఖాళీ అవుతున్న 10 స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన 10 మంది శాసనమండలి సభ్యుల పదవీకాలం.. ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో... ఆ లోగా కొత్త సభ్యుల నియామకం కోసం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 7 శాసనమండలి స్థానాలకు.... తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

షెడ్యూల్ ప్రకారం... మార్చి 6న ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడుతుంది. మార్చి 13 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. మార్చి 14న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు పరిశీలిస్తారు. ఉపసంహరణకు మార్చి 16 వరకు గడువు ఇచ్చారు. ఆయా స్థానాలకు ఒకరికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే.. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓట్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. పోలైన ఓట్లను అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి లెక్కించి... విజేతను ప్రకటిస్తారు. మార్చి 25 లోగా ఎన్నికలను పూర్తి చేస్తారు.

ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్ లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు.. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. ఏపీలో నారా లోకేశ్, పోతుల సునీత, బత్తుల అర్జునుడు, డొక్కా మాణిక్య వర ప్రసాదరావు, వరాహ వెంకట సూర్య నారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. మరో సభ్యుడైన ఎమ్మెల్సీ ఛల్లా భగరీథ రెడ్డి గతేడాది నవంబర్ లో కన్నుమూయడంతో... అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇక... తెలంగాణలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ ల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.

ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైఎస్సార్సీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్యనారాయణ రాజు (విజయనగరం), పోతుల సునీత(బాపట్ల), కోలా గురువులు (విశాఖ), బొమ్మి ఇజ్రాయెల్ (కోనసీమ), జయమంగళ వెంకటరమణ (ఏలూరు), చంద్రగిరి ఏసురత్నం (గుంటూరు), మర్రి రాజశేఖర్ (పల్నాడు) లను అభ్యర్థులుగా సీఎం జగన్ ప్రకటించారు. సంఖ్యా పరంగా చూస్తే... అన్ని స్థానాలను అధికార వైఎస్సార్సీపీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణలో.. ఖాళీ అవుతోన్న 3 స్థానాలకు అధికార బీఆర్ఎస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. సంఖ్యా పరంగా చూస్తే.. మూడు స్థానాలు బీఆర్ఎస్ కే దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆశావాహుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో.... సీఎం కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

IPL_Entry_Point