AP Teachers Mlc Elections : తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల, డిసెంబర్ 5న పోలింగ్
AP Teachers Mlc Elections : తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. ఈ నెల 11న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 5 పోలింగ్ నిర్వహిస్తారు.
ఏపీలోని తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గతేడాది డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది.
ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 19వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 21 తుది గడువుగా నిర్ణయించారు. డిసెంబర్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 9వ తేదీన ఓట్ల కౌంటింగ్ ఫలితాలు ప్రకటన ఉంటుందని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.
ఉపఎన్నిక షెడ్యూల్
1.నోటిఫికేషన్ జారీ - నవంబర్ 11, 2024 (సోమవారం)
2.నామినేషన్లు వేయడానికి చివరి తేదీ - నవంబర్ 18, 2024 (సోమవారం)
3.నామినేషన్ల పరిశీలన- నవంబర్ 19, 2024 (మంగళవారం)
4. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ- నవంబర్ 21 , 2024 (గురువారం)
5. పోలింగ్ తేదీ- డిసెంబర్ 05, 2024 (గురువారం)
6. పోలింగ్ సమయం - 08:00 am- 04:00 pm
7.ఓట్ల లెక్కింపు - డిసెంబర్ 09, 2024 (సోమవారం)
8. ఎన్నికలు ముగించాల్సిన తేదీ-12 డిసెంబర్, 2024 (గురువారం)
తూర్పు, పశ్చిమగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫారం-18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈసీ తెలిపింది. నవంబర్ 23న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ను విడుదల చేయనున్నారు. డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్ 30న తుది జాబితాను వెల్లడించనున్నారు.
2025 మార్చి 29తో ఉమ్మడి కృష్ణా-గుంటూరు. తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ, ఇళ్ల వెంకటేశ్వరరావు పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- గ్రాడ్యూయేట్ ఓటు కోసం నమోదు చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే MLC -e Registration ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ కనిపింటే గ్రాడ్యూయేట్ - 18 ఆప్షన్ పై నొక్కాలి.
- మీ ప్రాథమిక వివరాలతో Sign-Up కావాలి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది.
- ఆ తర్వాత అప్లికేషన్ - 18పై క్లిక్ చేయాలి. మీరు ఏ గ్రాడ్యూయేట్ నియోజకవర్గం కిందికి వస్తారో అక్కడ క్లిక్ చేయాలి.
- మీ పూర్తి వివరాలను ఎంట్రీ చేయాలి. విద్యార్హత పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ పై నొక్కితే అప్లికేషన్ పూర్తి అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
- ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తో మీ అప్లికేషన్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం