Samarlakota Pancharamam : ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సామర్లకోటలో దర్శనాలకు బ్రేక్ పడింది. బుధవారం నుంచి సామర్లకోట కుమార చాళుక్య భీమేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్ దర్శనాలను నిలిపివేయనున్నారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో శివలింగ జీర్ణోద్ధరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. దీంతో నేటి నుంచి జూన్ 8 వరకు గర్భాలయ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో బల్ల నీకంఠం పేర్కొన్నారు. అయితే భక్తుల సౌకర్యార్థం నంది మండపంలో ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అక్కడ అర్చక స్వాములు బాల త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామికి పూజలు నిర్వహించనున్నారు.
పంచారామాలు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉన్నాయి. వందల ఏళ్ల నాటి శిల్పకళలు, వేల ఏళ్ల చరిత్రకు పంచారామాలు ప్రసిద్ధి. ఈ పంచారామాలన్నీ ప్రకృతి సోయగాల వడిలోనే ఉన్నట్టు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఈ పంచారామాలు ముఖ్యమైనవి. ఐదు పంచారామాల్లో రెండు తూర్పు గోదావరి, రెండు పశ్చిమ గోదావరి, ఒకటి గుంటూరు జిల్లాలో ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో రెండు పంచారామాలు ఉన్నాయి. అవి ఒకటి సామర్లకోటలో కుమార భీమారామం, మరొకటి రామచంద్రాపురానికి సమీపంలో ద్రాక్షారామం. సామర్లకోటలో ఉన్న కుమార భీమారామం క్షేత్రంలో కుమారస్వామి స్వయంగా ఇక్కడి లింగాన్ని ప్రతిష్టంచారని ప్రతీక. అందువల్ల కుమారారామమని పిలుస్తారు. చాళుక్య రాజు భీముడు ఈ ఆలయాన్ని నిర్మించారు. అందువల్ల కుమారభీమారామంగా పేరు గాంచింది. చైత్ర, వైశాఖ మాసాల్లోని సూర్యకాంతి ఉదయం సమయంలో స్వామివారి పాదాలనీ, సాయంత్రపు వేళలల్లో అమ్మవారి పాదాలను తాకుతాయి. దీన్ని ఇక్కడి విశేషంగా భావిస్తారు.
తూర్పుగోదావరిలో ఉన్న మరొక పంచారామం ద్రాక్షారామం. రామచంద్రాపురానికి సమీపంలో ఉన్న ద్రాక్షారామం అత్యంత ముఖ్యమైన శైవక్షేత్రం. ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం చేశారని చరిత్ర చెబుతోంది. అందువల్ల ఈ ప్రాంతానికి ద్రాక్షారామం పేరు వచ్చిందని అంటారు. భీమేశ్వరస్వామి సహచరి మాణిక్యాంబను అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. అలాగే దక్షిణ కాశీగా, త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ద్రాక్షారామం ఆలయాన్ని పేర్కొంటారు.
పశ్చిమగోదావరి జిల్లాలో రెండు పంచారామాలు ఉన్నాయి. అవి ఒకటి భీమవరానికి సమీపంలో ఉన్న సోమారామం, మరొకటి పాలకొల్లులో ఉన్న క్షీరారామం. భీమవరానికి సమీపంలో ఉన్న గునుపూడి గ్రామంలోని శివక్షేత్రమే సోమారామం. ఇక్కడ శివలింగం చంద్రుడు ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ క్షేత్రానికి సోమారామమనే పేరు వచ్చింది. పేరుకు తగ్గట్టే చంద్రుని కళలతో పాటు పౌర్ణమి, అమావాస్యలకు మధ్య శివలింగం రకరకాల రంగుల్లోకి మారడంతో భక్తులు అద్భుతంగా భావిస్తారు.ఈ ఆలయాన్ని కూడా చాళుక్య రాజు భీముడు నిర్మించాడు. అందువల్ల ఈ పంచారామాన్ని భీమారామం అని కూడా పిలుస్తారు.
పాలకొల్లులో ఉన్న క్షీరారామాన్ని సాక్షాత్తూ శ్రీరాముడే లింగాన్ని ప్రతిష్టించారు. అందువల్ల ఇక్కడి స్వామికి రామలింగేశ్వరుడనే పేరు స్థిరంగా ఉంది. శివలింగం పైభాగం కాస్త మొనదేలి ఉంటుంది. అందువల్ల స్వామివారికి కొప్పురామలింగేశ్వరుడు అనే పేరు ఉంది. ఇక్కడి శివలింగం తెల్లగా పాలరంగులో ఉంటుంది. అందువల్ల స్వామివారిని క్షీరారామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు.
గుంటూరులోని అమరావతిలో ఒక పంచారామం ఉంది. దాన్ని అమరారామం అంటారు. ఇక్కడ లింగాన్ని సాక్షాత్తూ ఇంద్రుడే ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి అమరలింగేశ్వరుడు పది అడుగులకు పైబడి ఉంటుంది. అందువల్ల స్వామిని పూర్తిగా దర్శించుకోవాలంటే రెండంతస్తుల మెట్లను ఎక్కాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం