East Godavari Crime : ప్రేమ పేరుతో మాయమాటలు, కాలేజీ విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారం
East Godavari Crime : తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో నమ్మించి కాలేజీ విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు రావడంతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
East Godavari Crime : తూర్పుగోదావరి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంటర్మీడియట్ విద్యార్థినిపై జూనియర్ కాలేజీ లెక్చరర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బయటకు పొక్కడంతో కీచక లెక్చరర్ పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న వినయ్ వర్ధన్ అదే కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొవ్వూరుకు చెందిన విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడిపాడు. అయితే లెక్చరర్ వినయ్ వర్ధన్‌కు గతంలోనే వివాహం అయింది. 2014లో భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగానే ఉంటున్నాడు.
పెళ్లి కాలేదని నమ్మించి
ఈ నేపథ్యంలో తనకు పెళ్లి కాలేదని చెప్పి విద్యార్థినిని నమ్మించాడు. నిన్ను నేను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఆమెకు పదే పదే చెప్పాడు. ఆమె కూడా ఆ కీచక లెక్చరర్ మాటలను నమ్మింది. ఈ క్రమంలోనే ఆమెను జనవరి 28న తేదీన రాత్రి మోటారు సైకిల్ ఎక్కించుకుని విజయవాడ తీసుకెళ్లాడు. అక్కడ ఒక లాడ్జిలో రూమ్ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి అనంతపురంతో పాటు పలు ప్రాంతాల్లో తిప్పాడు. ఈ క్రమంలో బాలికపై వినయ్ వర్ధన్ పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు జనవరి 29న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈనెల 2 తేదీన (ఆదివారం) బాలిక కొవ్వూరుకు తిరిగి వచ్చింది. తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు బాలిక తెలిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు లెక్చరర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
లొంగిపోయిన నిందితుడు
మహిళ ఎస్ఐ ద్వారా వివరాలను నమోదు చేసి, బాలిక ఫోన్, సీసీ టీవీ పుటేజీల సహకారంతో నిందితుడిని గుర్తించారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, మరోవైపు నిందితుడే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు. డీఎస్పీ జి.దేవకుమార్, కొవ్వూరు పట్టణ సీఐ పి. విశ్వం, ఎస్ఐ కె. జగన్మోహన్ రావు నిందితుడిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. అనంతరం మీడియాకు పూర్తి వివరాలు వివరించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం