Leopard In Rajahmundry : కడియం పరిసరాల్లో చిరుత సంచారం, తీవ్ర భయాందోళనలో ప్రజలు
Leopard Movement In Rajahmundry : గత 20 రోజులుగా రాజమంత్రి పరిసరాల్లో తిష్ఠవేసిన చిరుత...తాజాగా కడియం మండలంలోని నర్సరీలో కనిపించింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తు్న్నారు. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
Leopard Movement In Rajahmundry : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. కడియంలోని ఓ కల్యాణ మండపం సమీపంలో ఉన్న నర్సరీలో మంగళవారం అర్ధరాత్రి చిరుతను చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా...అధికారులు రంగంలోకి దిగి పాదముద్రలు పరిశీలించి చిరుతపులిగా నిర్ధారించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. చిరుతను పట్టుకునేందుకు బోన్, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు. చిరుత సంచారంతో కడియం మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత 20 రోజులుగా రాజమండ్రి శివారు ప్రాంతాలైన దివాన్‌చెరువు, లాలాచెరువులో ప్రజలను భయాందోళనకు గురిచేసిన చిరుత... తాజాగా కడియం మండలంలో కనిపించింది. కడియం మండలంలోని కడియం వీరవరం రోడ్డు మధ్యలో ఉండే దోసాలమ్మ కాలనీలో చిరుత పులి పాదముద్రలు కనిపించడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
కడియపులంక పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా అటవీశాఖ అధికారి ఎస్.భరణి నిర్థారించారు. అటవీశాఖ అధికారులు కడియం మండలంలో పాదముద్రలను గుర్తించి అవి చిరుతపులివేనని నిర్ధారించారు. కడియం మండల పరిధిలోని కడియపులంకలో వందల సంఖ్యలో నర్సరీలు ఉన్నాయి. అక్కడ నిత్యం పెద్ద సంఖ్యలో వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయి. నర్సరీల్లో పనులు చేసేందుకు వచ్చే కూలీలు చిరుతపులి భయంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
20 రోజులుగా రాజమండ్రి అభయారణ్యంలో
రాజమండ్రి పరిసరాల్లో అడవుల నుంచి జనావాసాల్లోకి చేరిన చిరుతపులి 20 రోజులుగా ఇక్కడ తిష్ఠవేసింది. దివాన్ చెరువు సమీపంలో సుమారు 950 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో తిష్టవేసిన చిరుత రాత్రి సమయాల్లో దివాన్ చెరువు, లాలా చెరువు ప్రాంతాల్లో ఇటీవల సంచరించింది. చిరుత సంచారంతో హౌసింగ్‌బోర్డు కాలనీ, ఆటోనగర్, స్వరూపనగర్, శ్రీరూపా నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. దీంతో సుమారు 100 వరకు ట్రాప్‌కెమెరాలు, 15 వరకు ట్రాప్ కేజ్ లను ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే చిరుత ట్రాప్ కెమెరాలకు మాత్రమే చిక్కింది. గత నాలుగు రోజులుగా చిరుత జాడ కనిపించలేదు. తాజాగా మంగళవారం రాత్రి కడియపులంక పరిసరాల్లో చిరుత జాడ కనిపించింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలంలో మంగళవారం అర్ధరాత్రి చిరుత సంచారం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ జిల్లా అటవీ శాఖాధికారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
సంబంధిత కథనం