East Godavari Crime : ఒంటరిగా ఇంటికి వెళ్తున్న మహిళపై అత్యాచారయత్నం, నలుగురు డిగ్రీ విద్యార్థులు అరెస్టు
East Godavari Crime : తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళలపై డిగ్రీ విద్యార్థి అత్యాచారయత్నం చేశాడు. రాత్రికి ఇంటికి వెళ్తున్న మహిళలను అడ్డగించి బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో మహిళపై అత్యాచారయత్నం జరిగింది. మహిళపై డిగ్రీ చదివే యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. అయితే ఈ ఘటనలో స్నేహితుడు చేసిన పనికి మొత్తం నలుగురు డిగ్రీ విద్యార్థులపై కేసు నమోదు అయింది. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో ఒంటరిగా ఇంటికి నడిచి వెళ్తున్న మహిళపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఆమెను బలవంతంగా లాక్కొని వెళ్లగా ఆమె కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు ఆమెను వారి నుంచి రక్షించారు.
ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 47 ఏళ్ల మహిళ రోజూ రాజమహేంద్రవరం వెళ్లి పని చేసుకొని తిరిగి ఇంటికి వస్తూ జీవనం సాగిస్తుంది. గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ కథనం ప్రకారం ఎప్పటి లాగే విధులు ముగించుకుని గోకవరం చేరుకున్న మహిళ ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది.
అప్పటికే స్నేహితుడు పుట్టిన రోజు వేడుకలో పాల్గొని వచ్చిన షేక్ కన్ననజీర్ (20) రోడ్డుపై మందుగుండు సామాగ్రిని కాల్చుతున్నాడు. టపాసులతో స్నేహితుడి పుట్టిన రోజు వేడుకులు చేస్తున్నాడు. ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళపై నజీర్ కన్ను పడింది. ఆమెను వెంబడించి పక్కనే మూతపడిన పెట్రోల్ బంకులోకి బలవంతంగా లాక్కొని వెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి యత్నించడంతో ఆమె కేకలు వేసింది.
దీంతో అటుగా వెళ్తున్న కొంతమంది స్థానికులు అక్కడకు చేరుకుని మహిళను రక్షించారు. ఇంతలోనే నజీర్ స్నేహితులు అక్కడకు చేరుకోగా స్థానికులకు వారికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీనిపై మహిళ గోకవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన ఎస్ఐ పవన్ కుమార్ నజీర్‌తో పాటు అతడి ముగ్గురు స్నేహితులపై కేసు నమోదు చేశారు. అనంతరం మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు.
ఈ నలుగురు రాజమహేంద్రవరంలో ఒక కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. స్నేహితుడి నజీర్ చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు శిక్షలో భాగస్వామ్యం అయ్యారు. స్నేహితుడి కోసం వెళ్లి కేసులో ఇరుకున్నట్లు అయింది. దీంతో వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. స్నేహితుడు చేసిన తప్పుడు పనికి సపోర్టు చేయకూడదని దీంతో అర్థమవుతుందని ఎస్ఐ తెలిపారు. ఇలాంటి తప్పుల వల్ల జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు