Pawan Kalyan : సంకీర్ణ ప్రభుత్వంలో సమస్యలు ఉంటాయని, ఏం జరిగినా 15 ఏళ్లు కలిసే ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మాన చర్చలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..."కింద పడతాం... మీద పడతాం... నన్ను ఒక మాట అన్నా సరే... అది మా కుటుంబ విషయం. ఏం జరిగినా మేము 15 సంవత్సరాలు కలిసే ఉంటాం. వైసీపీని సభలో అడుగుపెట్టనివ్వం, అధికారంలోకి రానివ్వం" అన్నారు. నిన్న సభలో వైసీపీ నేతల విధ్వంసం చూస్తే వివేకా హత్య గుర్తొచ్చిందన్నారు.
గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు అలా ప్రవర్తించవచ్చా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు గొడవలు, బూతులకు పర్యాయ పదంగా మారిపోయారన్నారు. ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు ఎలా తట్టుకుని నిలబడగలిగారా? ఆయన హ్యాట్సాప్ అన్నారు.
ఎన్డీయే సభ్యులు సభలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ నేతల తీరుపట్ల గవర్నర్‌కు తాము క్షమాపణలు చెబుతున్నామన్నారు. మా తప్పు లేకున్నా గవర్నర్‌కు క్షమాపణలు చెబుతున్నామన్నారు. గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిందని, వారి హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. నిన్న సభలో గొడవ చూస్తే వైసీపీ విధ్వంస విధానాలు గుర్తొచ్చాయన్నారు.
ప్రజావేదిక కూల్చివేసిన తీరు, 200 పైచిలుకు ఆలయాలు కూల్చివేత, డాక్టర్ సుధాకర్ చనిపోయిన విధానం, సుప్రీంకోర్టు జడ్జిపై లేఖ, హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో విమర్శలు, చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టిన విధానం, అమరావతి రైతులను కొట్టించి కేసులు పెట్టిన తీరు, తిరుమల కల్తీ లడ్డూ ఘటనలు గుర్తొచ్చాయన్నారు.
"సంకీర్ణ ప్రభుత్వం అంటే సవాళ్లతో కూడుకున్నది. రాష్ట్ర ప్రజల కోసం నిలబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. 15ఏళ్ల పాటు ఎన్డీయే కూటమి అధికారంలో ఉంటుంది. మేం కలిసి లేకుంటే ప్రజలకు ద్రోహం చేసినట్టే అవుతుంది. మమ్మల్ని అగౌరవ పరిచేలా మాట్లాడినా కలిసే ఉంటాం. గవర్నర్ కు గౌరవం ఇవ్వని వైసీపీ ఈ సభలోకి రాకూడదు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
గిరిజన గ్రామంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అంబులెన్సు కూత వినని పరిస్థితులు, నేడు ఒక గిరిజన గర్భిణీ స్త్రీ ఆరోగ్యవంతమైన మగ బిడ్డకు జన్మనిచ్చే స్థితికి సదుపాయాల కల్పించామని పవన్ కల్యాణ్ అన్నారు. ఒకే రోజు 13,326 గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పామని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 1800 కి.మీ సీసీ రోడ్లు వేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 4 వేల కి.మీకు పైగా సీసీ రోడ్లు వేసిందన్నారు.
22 వేలకు పైగా గోకులాలు నిర్మించామన్నారు. గత ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ నిధులు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రి 77 ఎకరాల అటవీభూమి ఆక్రమించారన్నారు. ఎర్రచందనం కొట్టి తరలిస్తుంటే కర్ణాటక అటవీ అధికారులు వాటిని పట్టుకున్నారు. ఆ ఎర్రచందనం వేలం వేస్తే కర్ణాటకకు రూ.185 కోట్ల ఆదాయం వచ్చిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
సంబంధిత కథనం