Pawan Kalyan : సినీ పరిశ్రమకు రాజకీయ రంగు పూయడం ఇష్టం లేదు, టికెట్ల విషయంలో హీరోలు ఎందుకు దండాలు పెట్టాలి - పవన్ కల్యాణ్
Pawan Kalyan : సినీ పరిశ్రమకు రాజకీయ రంగు పూయడం మాకు ఇష్టం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు డిమాండ్ అండ్ సప్లై ఆధారంగానే ఉంటుందన్నారు. సినిమా టికెట్ల కోసం హీరోలు వెళ్లి ఎందుకు ప్రభుత్వాధినేతలకు దండాలు పెట్టాలని పవన్ ప్రశ్నించారు.
Pawan Kalyan : సినీ పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ...పవన్ కల్యాణ్, రామ్ చరణ్... మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో ఉన్నా.. దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తనను ఓజీ అనండి.. డిప్యూటీ సీఎం అనండి... అన్నింటికి ఆయనే ఆద్యుడు అన్నారు. తాను ఎప్పటికీ మూలాలు మర్చిపోనని తెలిపారు. సినిమా టికెట్ ధరల పెంపుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
డిమాండ్ అండ్ సప్లై ఆధారంగానే టికెట్ ధరల పెంపు ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. డైరెక్టర్ శంకర్ సినిమాను తాను బ్లాక్‌లో టికెట్ కొని చూశానన్నారు. అలా టికెట్ కొనడం వల్ల ఆ డబ్బు వేరేవాళ్లకు వెళ్తోందన్నారు. ప్రభుత్వం టికెట్ ధరలు ఊరికే పెంచడం లేదని, టికెట్ ధరలు పెంచడం వల్ల జీఎస్టీ వస్తుందన్నారు. అది ప్రభుత్వానికి ఆదాయమే అన్నారు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడానికి తమకు ఇష్టం లేదని పవన్ అన్నారు.
సినిమా టికెట్ల కోసం హీరోలు వెళ్లి ప్రభుత్వాధినేతలకు ఎందుకు దండాలు పెట్టాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కావాలంటే నిర్మాతలు, యూనియన్లు మాట్లాడాలన్నారు. హీరోలు వచ్చి నమస్కారం పెట్టాలి అనుకునేంత తక్కువ స్థాయి వ్యక్తులం తాము కాదన్నారు. ఇది స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నామన్నారు.
"ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది రామ్ చరణ్ లో చూశాను. నేను కనీసం చెప్పులు వేసుకుంటాను. చరణ్ చెప్పులు కూడా లేకుండా చాలా సింపుల్ గడిపేస్తారు. ఎప్పుడూ ఏదొక మాల వేస్తుంటారు. అందుకే ఆస్కార్ స్థాయికి వెళ్లారు"- పవన్ కల్యాణ్
గతంలో తన సినిమాలకు టికెట్ ధరలు పెంచకపోగా, తగ్గించారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వానికి సినీ నటులు అందరూ మద్దతు తెలపలేదని, అయినా తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. హీరోలతో నమస్కారాలు పెట్టించుకునే వ్యక్తులం తాము కాదన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని కాదని, భారతీయ చిత్ర పరిశ్రమ అనేదే మన నినాదం అన్నారు. మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి తెలియజేయాలన్నారు. చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ రావాలని కోరారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటే సినిమాలు తీసే వాళ్లే మాట్లాడాలన్నారు. సినిమాలు తీసే వాళ్లతోనే తాము మాట్లాడుతామన్నారు. సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పనేంటి? నిర్మాతలు చర్చించాలన్నారు. హీరోలతో దండాలు పెట్టించుకునేంత కిందిస్థాయి వ్యక్తులం కాదన్నారు.
సీఎం చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారని పవన్ కల్యాణ్ తెలిపారు. సినిమా మంచి, చెడు రెండింటినీ చూపిస్తుందన్నారు. ఏది తీసుకోవాలో ప్రేక్షకుల ఇష్టం అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా సినిమాలు తీయాలని కోరారు. నిజ జీవితంలోని సంఘటనలు సినిమా ప్రపంచంలో స్ఫూర్తినిస్తాయన్నారు. కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే కాదని, విలువలు నేర్పించాలన్నారు. ఏపీలో స్టూడియోలు నిర్మించాలని, యువతకు తగిన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కారోరు. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే తెలంగాణ, ఏపీ అన్నారు. ఏపీ యువతలోని శక్తిని సినీ పరిశ్రమ వినియోగించుకోవాలని కోరారు. ఏపీలో స్టంట్ స్కూల్స్, స్టూడియోలు ఏర్పాటు చేయాలన్నారు. 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన విషయాలు నేర్పించాలన్నారు.
సంబంధిత కథనం