Pawan Kalyan : పెట్రోల్ బాంబులేసి భూములు లాక్కున్నారు- సరస్వతి భూములపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు-dy cm pawan kalyan sensational comments on ys jagan saraswati power plant lands ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : పెట్రోల్ బాంబులేసి భూములు లాక్కున్నారు- సరస్వతి భూములపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan : పెట్రోల్ బాంబులేసి భూములు లాక్కున్నారు- సరస్వతి భూములపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
Nov 05, 2024 05:41 PM IST

Pawan Kalyan : వైఎస్ జగన్ పవర్ ప్లాంట్‌ పేరుతో భూములు లాక్కొన్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. బాంబు లేసి, బెదిరించి ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కొన్నారని ఆరోపించారు. సరస్వతి భూములపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ ను ఆదేశించారు.

బాంబులేసి, భయపెట్టి లాక్కున్నవే- సరస్వతి భూములపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
బాంబులేసి, భయపెట్టి లాక్కున్నవే- సరస్వతి భూములపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో కూటమి ప్రభుత్వం రాకుంటే, వైసీపీ దోపిడీకి అడ్డుకట్ట పడేది కాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కట్టని సిమెంట్ కంపెనీ ఫ్యాక్టరీకి వైసీపీ నేతలు 190 కోట్ల లీటర్ల పైన నీరు రాసేసుకున్నారన్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆ భూములకి సంబంధించిన వివరాలను డిప్యూటీ సీఎంకు తెలిపారు. సరస్వతి భూములను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి పవన్ పరిశీలించారు.

బాంబులేసి, భయపెట్టి

మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ ప్లాంట్ కోసం వైసీపీ నాయకుడు ఆనాడు భూ యజమానులకు తమ బిడ్డల్ని చదివిస్తాం, ఉద్యోగాలిస్తాం అని నమ్మబలికి భూములు రాయించుకున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వేమవరంలో 710.6 ఎకరాలు, జామయపాలెంలో 273 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 93.79 ఎకరాలు, తంగెడ గ్రామంలో 107.36 ఎకరాలు.. మొత్తం రైతాంగం దగ్గర నుంచి కొన్నది 1384 ఎకరాలు అన్నారు. పట్టా భూములు 1083 ఎకరాలు కాగా...వీటిల్లో సగం పైగా బాంబులేసి, భయపెట్టి లాక్కున్నవే అని ఆరోపించారు.

ప్రజల ఆస్తులు బలవంతంగా లాక్కొని, తమ సొంత ఆస్తిలా వైఎస్ జగన్‌ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. వైసీపీ నేతలు ఇంకా తామే అధికారంలో ఉన్నామని భావిస్తున్నారన్నారు. ఎవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు.

బలవంతంగా భూమిని లాక్కున్నారు

సరస్వతి పవర్‌ ప్లాంట్‌ కోసం వైఎస్ జగన్ సొంతంగా భూములు తీసుకున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. 2009లో వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు పవర్ ప్లాంట్ కోసం సరస్వతి భూములను 30 ఏళ్లకు లీజుకు తీసుకున్న జగన్‌ తాను సీఎం అయిన లీజును 50 ఏళ్లు పొడిగించుకున్నారన్నారు. కానీ ఇప్పటికీ ప్రాజెక్టును నిర్మించలేదన్నారు. ఫర్నీచర్ పేరిట కోడెల శివప్రసాద్ రావును వేధించి చంపేశారన్నారు. తనపై నాటు బాంబులు వేసి భయపెట్టారన్నారు. జగన్ పవర్ ప్లాంట్‌ పేరుతో భూములు లాక్కొన్నారన్నారు. మరోచోట 350 ఎకరాలు, ముడి సరకు కోసం 1100 ఎకరాలు తీసుకున్నారన్నారు. బలవంతంగా ప్రజల భూమిని తీసుకొని వారినే ఇబ్బందులకు గురిచేశారన్నారు.

నాలుగు వందల ఎకరాల అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చి లాక్కున్నారని స్థానికులు అంటున్నారని పవన్ విమర్శించారు. సరస్వతి పవర్ ప్లాంట్ కింద ఎంత భూమి ఉంది, ఎలాంటి అవకతవకలు జరిగాయనే దానిపై విచారణ చేయాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నామన్నారు. పెట్టిన ప్రాజెక్టు ఎందుకు ముందుకెళ్లలేదో తేల్చాలన్నారు. సహజ వనరులు ఉన్న ప్రాంతంలో 24 ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. సరస్వతి ప్లాంట్ కు భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామన్నారు.

"ఆనాడు తండ్రి ఇడుపులపాయలో వందల ఎకరాలు అసైన్డ్ భూములు ఆక్రమించారు. నేడు జగన్ సరస్వతి పవర్ కోసం 24 ఎకరాలు అసైన్డ్ భూములు, వందల ఎకరాలు పట్టా భూములు భయపెట్టి ఆక్రమించారు. మెతకగా ఉంటే వీళ్లు పేట్రేగిపోతున్నారు. మీకు అండగా ఉంటాను వాళ్ల తాట తీస్తా. సరస్వతి పవర్ కోసం దళితుల భూములు లాక్కున్నారు. ప్రజలను భయపెట్టి తీసుకున్న ఆస్తిని కుటుంబ ఆస్తిలా గొడవలాడుకుంటున్నారు. చుక్కల భూములు, అసైన్డ్ భూములపై సమగ్ర నివేదిక కోరుతాం. లేని కంపెనీ కోసం 196 కోట్ల లీటర్ల నీటిని కేటాయించుకున్నారు. అటవీ భూముల రికార్డులు మార్చారు. పెట్రోల్ బాంబులు వేసి రైతుల్ని భయబ్రాంతులకు గురి చేసి భూములు తీసుకున్నారు" - పవన్ కల్యాణ్

Whats_app_banner

సంబంధిత కథనం