Drone Flying Over Pawan Office : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీసుపై డ్రోన్ కలకలం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు
Drone Flying Over Pawan Office : మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీసుపై డ్రోన్ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్ ను ఆపరేట్ చేశారు. క్యాంపు ఆఫీస్ సిబ్బంది డ్రోన్ గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Drone Flying Over Pawan Office : మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం, నిర్మాణంలో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయ భవనంపై గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని క్యాంపు కార్యాలయం సిబ్బంది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. డిప్యూటీ సీఎం భద్రతా సిబ్బంది డ్రోన్ విషయాన్ని డీజీపీ, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీకి సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 గంటల వరకూ దాదాపు 20 నిమిషాల పాటు డ్రోన్ ఎగిరినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనల్లో వరుసగా భద్రతా పరమైన వైఫల్యాలు వెలుగుచూస్తు్న్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారిని పోలీసులు పట్టుకున్నారు. అలాగే విజయవాడ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవ సమయంలో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటం తీవ్ర చర్చకు దారి తీసింది. పవన్ కల్యాణ్ పర్యటనలలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటుచేసుకోవడంతో జనసేన శ్రేణులు ఆందోళన చెందుతున్నయి. ఈ సమయంలో పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం పైనుంచి డ్రోన్ వెళ్లడం... భద్రత విషయంలో పలు అనుమానాలకు తావిస్తోంది. డ్రోన్ విషయంపై వెంటనే స్పందించిన పోలీసులు డ్రోన్‌ను ఎవరు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీసు, చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
సంబంధిత కథనం