Pawan Kalyan : సంక్షేమం, సంస్కరణల సమపాళ్లు- బడ్జెట్ పై పవన్ కల్యాణ్ రియాక్షన్
Pawan Kalyan : కేంద్ర బడ్జెట్ పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా, దేశాన్ని అభివృద్ధిలో నడిపించేలా బడ్జెట్ ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.
Pawan Kalyan : కేంద్ర బడ్జెట్ సంక్షేమం, సంస్కరణలు సమపాళ్లుగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వ్యవసాయ, రైతాంగ, పారిశ్రామిక, సైన్స్ & టెక్నాలజీ, ఔషద, విమానయాన, మౌలిక రంగాల్లో సమూల మార్పులు చేస్తూ పేదరికం తగ్గించే దిశగా బడ్జెట్ రూపొందించారన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా, దేశాన్ని అభివృద్ధిలో నడిపించేలా బడ్జెట్ ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
"ఆదాయ పన్ను మినహాయింపు రూ.12 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరటగా నిలిచింది. ఒకేసారి 5 లక్షల పన్ను మినహాయింపు చేస్తూ 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచడం సాహసోపేతమైన నిర్ణయం" - పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సహకారం
"ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాలంలో రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించిన 2025-2026 వార్షిక బడ్జెట్ లో మరిన్ని కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. 5 కోట్ల ప్రజల ఆశలకు ప్రతిరూపంగా నిర్మాణం జరుగుతున్న ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లను కేటాయిస్తూ, భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తాం అని చెప్పడం రాజధాని నిర్మాణం సజావుగా, వేగవంతంగా సాగేందుకు ఉపయోగపడనుంది.
పోలవరం ప్రాజెక్టు వ్యయ సవరణకు ఆమోదం తెలపడమే కాకుండా రూ.5,936 కోట్లను కేటాయించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని 41.15 మీటర్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడం, బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157 కోట్లుగా ప్రకటించడం, పోలవరం అథారిటీకి అదనంగా మరో రూ.54 కోట్లు కేటాయించి, పోలవరం నిర్మాణం వేగవంతం అయ్యేందుకు సహకరించారు.
జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2028 వరకు పొడిగించడం ద్వారా ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్ అందించాలనే ఆశయాన్ని సాధించేందుకు తోడ్పడనుంది. కేంద్ర బడ్జెట్ లో రక్షణ శాఖ తరవాత అత్యధికంగా 2.66 లక్షల కోట్ల నిధులను గ్రామీణాభివృద్ధికి కేటాయించడం ద్వారా, రాష్ట్రంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అధిక నిధులు సాధించే ఆస్కారం లభించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 3295 కోట్లను కేటాయించడం ద్వారా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి రుజువైంది. అలాగే విశాఖ పోర్ట్ అభివృద్ధికి రూ. 730 కోట్లు కేటాయింపు ద్వారా పోర్ట్ సామర్థ్యం పెంపు, వాణిజ్యాభివృద్ధికి దోహదపడనున్నాయి" - పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం
కేంద్ర బడ్జెట్ కేటాయింపులను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటూ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా కృషి చేయనుందని పవన్ కల్యాణ్ అన్నారు.