ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ ను పవన్ తరఫున పౌరసరఫరాల కార్పొరేషన్ తోట సుధీర్ మంగళవారం పూర్తి చేశారు. ఈ స్థలంలో త్వరలోనే ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపారు. ఎన్నికల సమయంలో..పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని పవన్ అన్నారు. ఈ మాట మేరకు జులైలో పిఠాపురం నియోజకవర్గంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో గతంలో 1.44, 2.08 ఎకరాల స్థలం కొన్నారు. తాజాగా ఈ ప్రాంతంలోనే మరో 12 ఎకరాలు కొనుగోలు చేశారు.
ఇల్లింద్రాడ రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్లు 13, 28, 29 పరిధిలో 12 ఎకరాలను పవన్ కల్యాణ్ కొనుగోలు చేశారు. ఇటీవల పిఠాపురంలో పర్యటించిన పవన్... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం పాడా (పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేస్తామని పవన్ ప్రకటించారు. తాజాగా పిఠాపురంలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ అమోదం తెలిపింది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దివ్యాంగులకు ఉపకరణాలు, మూడు చక్రాల సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, పిఠాపురం ప్రాంతం సమగ్రాభివృద్ధి కోసం 'పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా)' ఏర్పాటు చేస్తామన్నారు. పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రస్తావిస్తూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల బాగోగులు, వారి జీవన స్థితిగతులు మెరుగుపరిచి పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం నేరుగా రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్ పోర్టునకు చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు గన్నవరంలో బయలుదేరి, సాయంత్రం 5.45 గంటలకు దిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. దిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 నుంచి 7 గంటల మధ్య అమిత్ షాతో పవన్ సమావేశం కానున్నారు.
ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరగనుంది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
సంబంధిత కథనం