Dy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...అధికారం చేపట్టినప్పటి నుంచీ అధికారులను పరుగులు పెట్టిస్తు్న్నారు. తాజాగా తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... తన కార్యాలయ సిబ్బందితో కలసి ప్రతి అర్జీని చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతోపాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతోపాటు, సమస్య తీవ్రతను బట్టి అధికారులతో మాట్లాడుతున్నారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియచేసిన సమస్య పవన్ కల్యాణ్ ను కదిలించింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని... వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు. అదే విధంగా యువతుల ఫొటోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలు పెట్టడం, ఇళ్లపై రాళ్లు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఆ యువకులు వివరాలు, బైక్స్ పై వేగంగా సంచరిస్తున్న ఫొటోలను, వాహనాల నంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు. గతంలో ఆ యువకులను పట్టుకొని హెచ్చరిస్తే... రోడ్డుపైకి వస్తే దాడి చేస్తామని బెదిరించారని బాధితులు తెలిపారు. ఆ యువకులు ఒక మహిళా ఎస్సైను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో ఫోన్ లో మాట్లాడారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఆడ పిల్లలను, మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ సమస్యపై వెంటనే దృష్టి సారిస్తామని తగిన చర్యలు తీసుకొంటామని తిరుపతి ఎస్పీ తెలిపారు.
ఏనుగుల బారి నుంచి ప్రజల్ని, పంటల్ని కాపాడేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం అటవీశాఖ ఉన్నతాధికారులతో అరణ్య భవన్ ఆయన సమీక్ష నిర్వహించారు. ఏనుగుల వల్ల పంటలు ధ్వంసంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పవన్ చర్చించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగుల గుంపులు పంటలను ధ్వంసం చేయడం, జనావాసాల్లోకి ప్రవేశించి దాడులు చేస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఏనుగుల సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల రైతులు, ప్రజల నుంచి ఏనుగుల సమస్యపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ అన్నారు. ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపేందుకు అటవీశాఖ వద్ద కుంకీ ఏనుగుల కొరత ఉందని అధికారులు డిప్యూటీ సీఎంకు తెలియజేశారు. కర్ణాటకలో కుంకీ ఏనుగులు సంఖ్య ఎక్కువగా ఉందని, వాటిని తీసుకురా గలిగితే ఈ ఏనుగుల సమస్య నివారించవచ్చన్నారు. తానే స్వయంగా కర్ణాటక ప్రభుత్వంతో కుంకీ ఏనుగుల విషయం మాట్లాడతానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
సంబంధిత కథనం