Dy CM Pawan Kalyan : తుని ప్రమాద ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం, బాధిత కుటుంబాలకు పవన్ క్షమాపణలు- రూ.2 లక్షల ఆర్థిక సాయం-dy cm pawan kalyan meeting tuni accident deceased family members say sorry behalf of police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Dy Cm Pawan Kalyan : తుని ప్రమాద ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం, బాధిత కుటుంబాలకు పవన్ క్షమాపణలు- రూ.2 లక్షల ఆర్థిక సాయం

Dy CM Pawan Kalyan : తుని ప్రమాద ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం, బాధిత కుటుంబాలకు పవన్ క్షమాపణలు- రూ.2 లక్షల ఆర్థిక సాయం

Bandaru Satyaprasad HT Telugu
Nov 09, 2024 11:01 PM IST

Dy CM Pawan Kalyan : కాకినాడ జిల్లా తుని రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు పోలీసుల తరఫున క్షమాపణలు చెప్పి, తన ట్రస్ట్ ద్వారా రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారు.

తుని ప్రమాద ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం, బాధిత కుటుంబాలకు పవన్ క్షమాపణలు- రూ.2 లక్షల ఆర్థిక సాయం
తుని ప్రమాద ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం, బాధిత కుటుంబాలకు పవన్ క్షమాపణలు- రూ.2 లక్షల ఆర్థిక సాయం

రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఇటీవల కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఈ వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల తల్లిదండ్రులతో పోలీసులు వ్యవహరించిన తీరు ఆ కుటుంబాలకు తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని తెలిపారు. శనివారం మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో.. ఇటీవల తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భీమవరం ప్రాంతానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీమురహరి, విజయవాడకు చెందిన నాదెండ్ల నిరంజన్ ల కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని చలించిపోయారు. మృతుల కుటుంబాలకు తన ట్రస్ట్ ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించారు.

ప్రమాదానికి కారణమైన వారిపై కేసు పెట్టలేదు

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... “ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన విషయం బాధించింది. ప్రమాదంపై ఫిర్యాదు చేసేందుకు వారి తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లగా అక్కడ అధికారులు ప్రవర్తించిన తీరు సరిగా లేదని తెలిసింది. కనీసం సమాధానం చెప్పకపోగా పోలీసులు మాట్లాడిన తీరు బాగాలేదు. రోడ్డు ప్రమాదంలో బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ తీవ్రమైనది. అంతటి కష్టాన్ని దిగమింగుకున్నారు. ఇద్దరు విద్యార్థుల్లో రేవంత్ బ్రెయిన్ డెడ్ అయితే... ఆయన తల్లిదండ్రులు అవయవదానం చేయడం నన్ను కదిలించింది. అయితే పోలీసులు ప్రమాదానికి కారణం అయిన డ్రైవర్ పై ఎలాంటి కేసులు పెట్టలేదని తెలిసింది. కారులో ప్రయాణిస్తున్న వైద్యుడు కూడా బాధ్యతగా వ్యవహరించకపోవడం దారుణం" అని అన్నారు.

పోలీసుల తీరుపట్ల క్షమాపణలు

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని తక్షణం ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఘటనా స్థలిలో ఉన్నవారిపై ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. కేసుల భయాల నుంచి బయటకు రావాలన్నారు. పోలీసులు ఉన్నతాధికారులు ఈ అంశం మీద అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. క్షతగాత్రులకు తక్షణం వైద్యం అందితే ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుందని తెలిపారు. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల తాను క్షమాపణలు చెబుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.

పవన్ కల్యాణ్ తో డీజీపీ భేటీ

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై కూటమి సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్, డీజీపీ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నేతల పోస్టులపై చర్యలు తీసుకోకపోవడంపై పోలీసుల తీరును పవన్ తప్పుబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, అరెస్టులపై పవన్ కల్యాణ్ తో డీజీపీ చర్చించినట్లు తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం