Dy CM Pawan Kalyan : వరద బాధితులకు రూ.కోటి విరాళం, పరామర్శకు అందుకే రాలేదు- పవన్ కల్యాణ్
Dy CM Pawan Kalyan : గత ప్రభుత్వం ప్రాజెక్టులను గాలికి వదిలేసింది, అందుకే వరద పరిస్థితులు నెలకొన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వరద సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే రాలేదన్నారు.
Dy CM Pawan Kalyan : గత ప్రభుత్వం ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. గతంలో అన్నమయ్య డ్యామ్ కూడా వైసీపీ నిర్లక్ష్యం కారణంగా కొట్టుకుపోయిందన్నారు. విజయవాడలో బుడమేరు పొంగిపోర్లటంతో విపరీతమైన నష్టం జరిగిందన్నారు. గత ప్రభుత్వం బుడమేరు నుంచి ఔట్ లెట్ కెనాల్స్ ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే బుడమేరు నుంచి వరద సమయాల్లో నీళ్లు వెళ్లిపోవడానికి ఔట్ లెట్ కాలువలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎప్పుడూ లేనంతగా వర్షాలు, వరద రావడం కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.కోటి విరాళం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటించినట్లు తెలిపారు. సహాయక కార్యక్రమాలకు ఇబ్బంది కాకూడదనే తాను బయటకు రాలేదన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రజలకు సహాయక చర్యలు చేపడుతుందన్నారు.
"నేను బయటకు రాలేదు అనే విమర్శలు అనవసరం. పంచాయతీ రాజ్ శాఖ నుంచి పూర్తిస్థాయిలో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బయటకు వస్తేనే కాదు, నేను చేసే పనులు అధికార యంత్రాంగంతో కలిసి ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాను. అధికారులు 72 గంటలుగా కష్టపడుతున్నారు. నేను పర్యటనకు వచ్చి వారిని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. అందుకే వరద ప్రాంతాలకి వెళ్లలేదు. నేను 1వ తేదీనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిద్దాం అనుకున్నాను, కాకపోతే నేను వస్తే సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది ఉంటుందని రాలేదు. నేను సాయపడాలే తప్ప, ఆటంకం కాకూడదు" - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
వరదలను ఎదుర్కొనేలా మాస్టర్ ప్లాన్
భవిష్యత్తులో వరదల వల్ల నష్టం తగ్గించేందుకు ప్రతీ నగరానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. దాదాపు రూ.80 కోట్ల అత్యవసర సాయాన్ని జిల్లాలకు విడుదల చేశామన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో నిందలు వేయడం కాకుండా, సహాయక చర్యల్లో పాల్గొనేలా ఉండాలన్నారు. అత్యవసర సహాయం కావలసిన వారు 112 లేదా 1070, 18004250101 నెంబర్లకు కాల్ చేయాలని కోరారు. వెంటనే కంట్రోల్ రూం సిబ్బంది అందుబాటులోకి వచ్చి సహాయం చేస్తారన్నారు. ప్రభుత్వం తరఫున సహాయక చర్యల్లో దాదాపు 188 బోట్లు, 5 హెలికాప్టర్లు, 283 మంది గజ ఈతగాళ్లు పాల్గొంటున్నారని తెలిపారు. 3 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేశామన్నారు.
రాష్ట్ర యంత్రాంగం మొత్తం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఐఏఎస్ అధికారులంతా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దు, పంచాయతీరాజ్ తరపున, రాష్ట్ర విపత్తు నివారణ కింద ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. సీఎం క్షేత్ర స్థాయిలో తిరుగుతూ పరిస్థితులు తెలుసుకుంటున్నారన్నారు. అతి తక్కువ సమయంలో ఎంతో సమర్థవంతంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తుల నుంచి నష్టం జరగకుండా చూస్తామన్నారు.
1.72 లక్షల హెక్టార్లలో పంట నష్టం
"దాదాపు 1.72 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 172 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. దాదాపు 328 రైళ్లు రద్దు అయ్యాయి. 6,44,536 మంది ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. 193 సహాయక కేంద్రాలు నిర్వహిస్తున్నాం. 42,747 మందికి పునరావాస కేంద్రాలకు పంపించాం. 194 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సహాయం అందిస్తున్నాం. ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయక చర్యలు చేపట్టాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా ప్రజలను రక్షిస్తున్నారు. అలాగే పంచాయతీ రాజ్ నుంచి 242 టీమ్స్ పనిచేస్తున్నాయి"- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రస్తుతం కాలనీల్లో వరద నీటి మట్టం తగ్గుతూ వస్తుందన్నారు. రేపటికి పూర్తిస్థాయిలో వరద అదుపులోకి వస్తుందని అధికారులు చెప్తున్నారన్నారు. ఇది ప్రకృతి విపత్తు అని, బుడమేరు గతంలో సరిగ్గా నిర్వహించినట్లైతే ఇలా జరిగేది కాదన్నారు. విజయవాడ నగరాన్ని వరదల నుంచి రక్షించుకోవడంపై వర్షాలు తగ్గిన తరవాత ప్రణాళికలు చేపడతామన్నారు. ఇతర నగరాల్లో కూడా వరద నియంత్రణ ఏర్పాట్లు చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
సంబంధిత కథనం