YSR Kadapa DTC: కడపలో దారుణం.. మహిళా అధికారిణిపై డీటీసీ లైంగిక వేధింపులు, ఆఫీసుకెళ్లి చితకబాదిన భర్త.. డీటీసీపై వేటు
YSR Kadapa DTC: కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుమార్తె వయసున్న మహిళా అధికారిణిపై కన్నేసిన డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఏకంగా ఆమె ఇంటికే వెళ్లి వేధింపులకు పాల్పడ్డాడు. సీసీ కెమెరాల్లో గమనించిన బాధితురాలి భర్త అతడికి దేహశుద్ధి చేశాడు.
YSR Kadapa DTC: వైఎస్సార్ జిల్లాలో కీచక అధికారికి మహిళా అధికారి భర్త దేహశుద్ధి చేయడం కలకలం రేపింది. జిల్లా రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి మహిళా అధికారిపై వేధింపులకు పాల్పడటం కలకలం సృష్టించింది. బరి తెగించి కుమార్తె కంటే చిన్న వయసులో ఉన్న యువతిని వేధించడమే కాకుండా భర్త మరో ఊళ్లో పనిచేస్తున్నాడని తెలిసి ఏకంగా ఇంటికే వెళ్లాడు. అధికారి చర్యలకు భయభ్రాంతురాలైన యువతి భర్తకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన అతను ఆ తర్వాత ఆఫీసుకు భార్యను తీసుకువెళ్లి అందరి ముందు చితకబాదాడు.

డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి వేధింపులతో ఇటీవల ఓ అధికారిణి బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. మరో అధికారిణికి వాట్సప్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. కోరిక తీర్చాలని బలవంతం చేస్తున్నాడు. తనను ఇబ్బంది పెట్టొద్దని, మీ కుమార్తె కంటే చిన్నదాన్ని అని తనను వదిలేయాలని బతిమాలినా కనికరించలేదు.
మహిళా ఎంవిఐ భర్త ఉద్యోగ రీత్యా పొరుగు జిల్లాలో పనిచేస్తారని తెలుసుకున్న చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉదయం నేరుగా ఆమె ఇంటికి వెళ్లారు. దీంతో ఆమె సీసీ కెమెరాల్లో అతడి రాకను గమనించి భర్తకు ఫోన్ చేసి చెప్పారు. సీసీ కెమెరాలలో డీటీసీ రాకను ఫోన్‌లో గుర్తించిన మహిళ భర్త అధికారి చేష్టలను గమనించారు. తలుపు తడుతూ మహిళా అధికారిణి పిలిచే ప్రయత్నం చేయగా ఆమె స్పందించక పోవడంతో ఆమె ఇంటి ముంగిట కూర్చున్నారు.
ఇవన్నీ గమనించిన అధికారిణి భర్త డీటీసీ చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేయగా.. స్పందించ కుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో పక్క జిల్లా నుంచి ఇంటికి వచ్చిన భర్త, ఆ తర్వాత భార్యను వెంటబెట్టుకుని ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లి కీచక అధికారిని సిబ్బంది ముందు చితకబాదారు. దీంతో బాధితురాలి కాళ్లపై పడి క్షమించాలని వేడుకున్నారు.
ఈ వ్యవహారం బయటకు రాకుండా రక్షించాలని ఉద్యోగులు, సిబ్బందిని వేడుకున్నారు. బాధితురాలితో పాటు అమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చూడాలని అందరిని ప్రాధేయపడ్డారు. గతంలో బాపట్లలో పనిచేసిన సమయంలో కూడా మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి.
సీఎం దృష్టికి వ్యవహారం…
కడప జిల్లాలో డీటీసీ వ్యవహారం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లడంతో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నానికి శాఖపరమైన విచారణ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ ఘటనపై బాధితురాలి వాంగ్మూలం, ప్రాథమిక సమాచారం ప్రభుత్వానికి అందడంతో డీటీసీపై సస్పెన్షన్ వేటు పడింది. డీటీసీని విధుల నుండి తొలగించి కేంద్ర కార్యాలయానికీ సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కడప జిల్లాలో పోస్టింగ్ దక్కించుకోవడం వెనుక డీటీసీ కొందరు నేతలు సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.