Andhra Drought: ఏపీలో ఐదు జిల్లాల్లో 54 మండలాల్లో కరువు పరిస్థితులు.. ఉదారంగా ఆదుకోవాలని కేంద్రానికి ఏపీ వినతి-drought conditions in five districts of ap ap requests the center for help ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Drought: ఏపీలో ఐదు జిల్లాల్లో 54 మండలాల్లో కరువు పరిస్థితులు.. ఉదారంగా ఆదుకోవాలని కేంద్రానికి ఏపీ వినతి

Andhra Drought: ఏపీలో ఐదు జిల్లాల్లో 54 మండలాల్లో కరువు పరిస్థితులు.. ఉదారంగా ఆదుకోవాలని కేంద్రానికి ఏపీ వినతి

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 10, 2025 04:00 AM IST

Andhra Drought: రాష్ట్రంలో 2024 ఖరీఫ్‌ సీజన్‌లో ఏపీలో ఐదు జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఖరీఫ్ కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందానికి ఐదు జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం వివరించింది.

ఏపీ కరువు పరిస్థితులపై కేంద్ర బృందం  సమీక్ష
ఏపీ కరువు పరిస్థితులపై కేంద్ర బృందం సమీక్ష

*Andhra Drought:ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది నెలకొన్న ఖరీఫ్ కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన కేంద్ర నుంచి సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని ఏపీ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్, ఆర్పీ సిసోడియా కోరారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో గురువారం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ పెరిన్ దేవి నేతృత్వంలోని కేంద్ర బృందంతో సమావేశమై రాష్ట్రంలో కరువు పరిస్థితులను వివరించారు.

yearly horoscope entry point

రాష్ట్రంలో కరువు పరిస్థితులను రెవిన్యూ కార్యదర్శి సిసోడియా కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు జిల్లాల్లోని 54 మండలాల్లో గత ఏడాది కరువు పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అన్నమయ్య జిల్లాలో - 19మండలాలు, చిత్తూరులో - 16 మండలాలు, శ్రీ సత్య సాయిలో - 10 మండలాలు, అనంతపురంలో - 7 మండలాలు, కర్నూలులో - 2 మండలాలను ఇప్పటికే ఇప్పటికే కరువు మండలాలు ప్రకటించారు. వాటిలో 27 తీవ్ర కరువు మండలాలు, 27 మధ్యస్థ కరువు మండలాలుగా సిసోడియా పేర్కొన్నారు.

కేంద్ర కరువు మాన్యువల్ ప్రకారం సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం, వర్షాభావంతో అత్యధిక డ్రైస్పెల్స్, రిమోట్ సెన్సింగ్, సాయిల్ మోయిశ్చర్, హైడ్రాలజీ, పంట నష్టం 33% అంతకంటే ఎక్కువ ఉన్న మండలాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కరువు ప్రాంతాలను ప్రకటించిందని వివరించారు.

కరువు ప్రభావంతో పత్తి, జొన్న, వేరుశెనగ, ఎర్ర శనగలు, మొక్కజొన్న మొదలైన 14 రకాల పంటలు దెబ్బతిని ఐదు జిల్లాల్లోని 1.06లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1 లక్ష మంది రైతులకు రూ.16.67 కోట్ల వ్యయంతో సుమారు 1 లక్ష మంది రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలు, రూ.55.47 కోట్ల వ్యయంతో పశుగ్రాసం, పశుగ్రాస విత్తనాల సరఫరా, 60% సబ్సిడీపై TMR (Total Mixed Ratio), 40% సబ్సిడీపై చాఫ్ కట్టర్లు, మందుల సరఫరా వంటి ఉపశమన చర్యలు చేపట్టినట్లు కేంద్ర బృందానికి సిసోడియా వివరించారు.

వ్యవసాయ శాఖ ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రూ. 90.62కోట్లు, రూరల్ వాటర్ సప్లై రూ. 0.78 కోట్లు, అర్బన్ వాటర్ సప్లై రూ. 4.89 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ.55.47 కోట్లు ఆర్థిక సహాయం అవసరమన్నారు. క్షేత్రస్థాయిలో కరువు నష్టానికి సంబంధించి వాస్తవిక వివరాలను అందించామని, రైతులను ఆదుకోడానికి సత్వరమే రూ.151.77 కోట్లు సాయం చేయాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ పెరిన్ దేవి మాట్లాడుతూ..కరువు కారణంగా నష్టపోయిన పంటల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వెల్లడించారు. పంట నష్టం జరిగిన రైతులను అన్ని విధాలా ఆదుకునేలా చూస్తామన్నారు.

అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని కరువు మండలాల్లో రైతులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను గమనించామని తమ నివేదికలో కేంద్రానికి అన్ని విషయాలను సమగ్రంగా తెలుపుతామని అన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ కరువు పరిస్థితుల తెలియజేశాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు కరువు వల్ల తమకు జరిగిన నష్టాన్ని వివరించారని చెప్పారు. త్వరగా కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి వీలైనంత మేర ఆదుకోవడానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని పెరిన్ దేవి స్పష్టం చేశారు.

Whats_app_banner