ADHAAR Struggles: ఆడోళ్లు ఆధార్‌ విషయంలో ఈ తప్పులు చేయకండి..! ఉద్యోగినులైతే అసలే చేయొద్దు.. బీ అలర్ట్‌-dont make these mistakes regarding aadhaar if you are an employee dont do it ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Adhaar Struggles: ఆడోళ్లు ఆధార్‌ విషయంలో ఈ తప్పులు చేయకండి..! ఉద్యోగినులైతే అసలే చేయొద్దు.. బీ అలర్ట్‌

ADHAAR Struggles: ఆడోళ్లు ఆధార్‌ విషయంలో ఈ తప్పులు చేయకండి..! ఉద్యోగినులైతే అసలే చేయొద్దు.. బీ అలర్ట్‌

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 07, 2024 02:23 PM IST

ADHAAR Struggles: ఆధార్‌ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. ఆధార్‌లో తప్పొప్పుల సరవణలు కూడా ఇప్పుడు సంక్లిష్టం అయిపోయాయి. ఈ క్రమంలో మహిళలు, ఉద్యోగినులు ఆధార్‌ వివరాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి.పెళ్లైన మహిళలు తెలిసి తెలియక ఆధార్‌లో నమోదులో చేసిన తప్పులు కొత్త కష్టాలకు కారణం అవుతోంది.

ఆధార్‌ కార్డుల్లో పేర్ల మార్పుతో తస్మాత్ జాగ్రత్త
ఆధార్‌ కార్డుల్లో పేర్ల మార్పుతో తస్మాత్ జాగ్రత్త

ADHAAR Struggles: దేశంలోని పౌరులందరికి విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించడం మొదలై దాదాపు పదిహేనేళ్లవుతోంది. ఈ క్రమంలో ఆధార్‌ కార్డుల్ని జారీ చేసిన తర్వాత ఇప్పటి వరకు వాటిలో తప్పొప్పుల్ని సవరించుకోని వారు, ఆధార్‌లో వివరాలను అప్డేట్‌ చేసుకోని వారు కూడా దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆధార్‌ కార్డు జారీ చేసే సమయంలో ప్రాథమికంగా ఉన్న సమాచారం ఆధారంగా అందులో వివరాలను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పెళ్లైన మహిళలు, గృహిణులు తమ భర్తల ఇంటిపేర్లతో ఆధార్‌ కార్డుల్లో నమోదు చేసుకున్నారు. అలాంటి వారందరికి ఇప్పుడు చిక్కులు తప్పడం లేదు.

yearly horoscope entry point

అమ్మాయిలు బీ అలర్ట్...

ఆధార్‌ విశిష్ట సంఖ్య ఇప్పుడు దేశంలో అన్నింటికి ఆధారమై పోయింది. పుట్టినప్పటి నుంచి చివరి మజిలీ వరకు అన్ని వివరాలు ఆధార్‌‌తో ముడిపెట్టేశారు. ఈ క్రమంలో చదువుకుని ఉద్యోగాలు చేసే మహిళలకు చిక్కులు తప్పడం ఆధార్‌ కార్డుల జారీ చేసే సమయంలో నమోదు చేసిన వివరాలకు, వారి సర్టిఫికెట్లలో ఉన్న పేర్లకు మార్పులు ఉంటే వాటిని సవరించుకోవడానికి తిప్పలు తప్పడం లేదు.

పుష్కరం క్రితం ఆధార్ కార్డులను జారీ చేసే సమయంలో మహిళల వివరాలను నమోదు చేసేటపుడు కుటుంబ వివరాల ఆధారంగా ఆధార్‌ కార్డులో పేర్లను నమోదు చేశారు. ఇందుకు రేషన్‌ కార్డు, ఓటరు కార్డు వంటి వాటిని ప్రామాణికంగా తీసుకున్నారు. ఆ సమయంలో చదువుకున్న మహిళలకు ఏ పేరును కొనసాగించాలనే దానిపై స్పష్టత కొరవడింది. దీంతో పెద్ద సంఖ్యలో మహిళలు భర్త ఇంటి పేరును ఆధార్‌ కార్డుల్లో నమోదు చేసుకున్నారు.

సవరణలు సులువు కాదు…

చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న గృహిణులు సైతం పలు కారణాలతో ఆధార్‌ కార్డుల్లో భర్త ఇంటిపేరును నమోదు చేసుకున్నారు. పెళ్లికి ముందే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తూ పాన్‌ కార్డుల ద్వారా పన్నులు చెల్లిస్తున్న మహిళల్లో కూడా కొందరు ఆధార్‌ కార్డుల్లో అత్తింటి పేర్లను నమోదు చేసుకోవడమో, మార్చుకోడమో జరిగింది. ఇలాంటి వారికి పాన్‌ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్ చేయడంలో సమస్యలు ఎదురయ్యాయి. ఆధార్‌, పాన్‌ కార్డుల్లో ఒకే రకమైన పేర్లు ఉంటేనే లింకింగ్ జరిగింది. వేర్వేరు పేర్లు ఉన్న వారిలో చాలామంది ఇప్పటికి ఆధార్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు.

ఆధార్‌ కార్డుల్లో పేర్ల మార్పు వ్యవహారం ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారింది. ప్రభుత్వం నిర్దేశిత పత్రాలతో పేర్ల మార్పులు, సవరణలు అనుమతిస్తున్నా రెండు రకాల పేర్ల విషయంలో పేచీలు తప్పడం లేదు. ఆధార్‌ కార్డులో అత్తింటి పేరుతో ఉన్న పేరును కొనసాగించాలో, పుట్టింటి పేర్లతో ఉన్న పాన్‌ కార్డుల పేర్లను కొనసాగించాలనే గందరగోళం నెలకొంది. దీనిపై ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పష్టత UIDAI కూడా ఇవ్వలేదు.

ఉద్యోగినులు తస్మాత్ జాగ్రత్త...

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాల్లో కొనసాగుతున్న మహిళలు తమ ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డులను పుట్టింటి పేర్లతోనే కొనసాగించడం ఉత్తమం అని ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉద్యోగినులు ఆధార్‌ జారీకి ముందు నుంచి పాన్‌ కార్డుల్లో ఉన్న వివరాలనే విధిగా కొనసాగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. వేతనాలు, సర్వీస్ రికార్డులు, పెన్షన్ చెల్లింపులు వంటి రికార్డులన్నీ విద్యార్హతల్లో ఉన్న పేర్ల ఆధారంగానే కొనసాగుతాయి. కుల ధృవీకరణ పత్రాలు, జనన ధృవీకరణ పత్రాల్లో ఉండే ఇంటిపేర్లనే కొనసాగించడం న్యాయపరమైన చిక్కులు లేకుండా చేస్తుందని చెబుతున్నారు.

భార్యాభర్తలు ఉద్యోగులైనా, పన్ను చెల్లిస్తున్నా...

భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగులైనా భార్య ఇంటిపేరును ఆధార్‌ కార్డులో మార్చకుండా ఉండటమే ఉత్తమం. ఆధార్‌ కార్డులో ఇంటి పేరు మారిస్తే దానిని పాన్ కార్డులో కూడా సవరించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలను కూడా వాటికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది.

భార్యాభర్తలిరువురూ ఉద్యోగులైన వారిలో భర్త తరపున నామినీలను, వారసులను నమోదు చేసే క్రమంలో భార్యకు కూడా భర్త ఇంటి పేరును రాస్తే పెన్షన్లు, ప్రభుత్వ ప్రయోజనాలను అందించే విషయంలో చిక్కులు తప్పవు.అనుకోని పరిస్థితుల్లో భర్త మరణిస్తే... అప్పటికే భార్య ఉద్యోగస్థురాలైనా, ఆదాయాన్ని ఆర్జిస్తున్నా, పన్ను చెల్లింపుదారు రాలైనా అప్పటికే ఆమెకు రికార్డులన్నీ పుట్టింటి పేరుతోనే కొనసాగుతాయి.

అలాంటి సమయంలో గెజిట్‌ నోటిఫికేషన్ ద్వారా పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి బదులు భర్త తరపు రికార్డుల్లో సైతం భార్య పేరును పుట్టింటి పేరుతోనే నమోదు చేయడం ఉత్తమం అని, పేర్లను మార్చుకోవడానికి అనేక అవరోధాలు ఉంటాయని చెబుతున్నారు. మహిళ పేరు తర్వాత డాటర్ ఆఫ్ స్థానంలో వైఫ్ ఆఫ్ మార్చుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.

ఇలాంటి సందర్భాల్లో ఆస్తుల కొనుగోలు, విక్రయాల సమయంలో కూడా చిక్కులు తలెత్తుతాయని గుర్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో భార్యాభర్తల ఇంటిపేర్లను సక్రమంగా నమోద చేయడం, మహిళల పేరుతో జరిగే రిజిస్ట్రేషన్లలో భార్య అసలు పేరుతో పాటు భర్త పేరును ఇంటి పేరుతో సహా నమోదు చేయాలని సూచిస్తున్నారు. ఆధార్‌ విషయంలో అనాలోచితంగా చేసే చిన్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. కాబట్టి లేడీస్ బీ అలర్ట్...

Whats_app_banner

సంబంధిత కథనం