ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అర్హులైన వారి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్త రైస్ కార్డ్ కోసం దరఖాస్తు చేయటంతో పాటు మార్పుల, చేర్పులకు కూడా అవకాశం ఉంది. దీంతో చాలా మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవటమే కాకుండా… పాత వాటిల్లోనూ మార్పుల కోసం అప్లికేషన్ పెట్టుకుంటున్నారు.
రేషన్ కార్డుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు కార్డులను మంజూరు చేయవద్దని నిర్ణయించింది. దీంతో స్వీకరిస్తున్న దరఖాస్తులను మూడు దశల్లో వెరిఫై చేయనుంది.
రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా…. ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది. ఈ 3 దశల పూర్తికి 21 రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో దరఖాస్తు పురోగతిని ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకునే వీలును కూడా కల్పించింది. కేవలం కంప్యూటర్, ల్యాప్ టాప్స్ లోనే కాకుండా మొబైల్ లోనూ చెక్ చేసుకునే అవకాశం ఉంది. క్షణాల్లోనే అప్లికేషన్ స్టేటస్ తెలిసిపోయేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తద్వార దరఖాస్తు ఏ అధికారి వద్ద ఉంది..? ఏ స్థితిలో ఉందనేది వెంటనే తెలిసిపోతుంది.
ఇక రేషన్ కార్డు పొందే వ్యక్తి కచ్చితంగా ఏపీ రాష్ట్రానికి చెందిన వ్యక్తై ఉండాలి. ప్రజాసాధికార సర్వే అనగా హౌస్ హోల్డ్ మాపింగ్ లో తప్పనిసరిగా నమోదై ఉండాలి. ఏ సచివాలయం పరిధిలో మ్యాప్ అయి ఉంటారో… ఆ సచివాలయం పరిధిలో మాత్రమే బియ్యం కార్డు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందినవి మాత్రమే అయ్యి ఉండాలి. ఇప్పటి వరకు ఎవరికైతే బియ్యం కార్డు లేదో…. ఆ వ్యక్తి వాళ్ల అమ్మ తరపున బియ్యం కార్డు లో కానీ అత్తగారి తరపు కార్డులో కానీ పేరు ఉండొద్దు. అలాంటి వారికి మాత్రమే కొత్త బియ్యం కార్డు ఇస్తారు.
మొదట్లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుబాటులో ఉన్న ఈ సేవలు… మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆధారంగా కూడా అమలు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది జూన్ మాసంలో క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ రైస్ కార్డులను జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కార్డులపై కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఉంటాయి. ఈ కార్డును స్కాన్ చేయగానే అన్ని వివరాలు కనిపిస్తాయి. డేటా బేస్ కి ఈ కార్డును లింక్ చేయడం వల్ల సిస్టమ్ లో ఆటో మేటిక్ గా డేటా కూడా అప్డేట్ అవుతుంది.
సంబంధిత కథనం