Flood Relief: బుడమేరు వరద సాయం అందలేదా ఇలా చేయండి…పీజీఆర్‌ఎస్‌లో నేరుగా దరఖాస్తు చేయాలని సూచించిన ఏపీ ప్రభుత్వం
Flood Relief: బుడమేరు వరదలు విజయవాడను ముంచెత్తి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వేలాదిమందికి ప్రభుత్వ పరిహారం దక్కలేదు. ఓ వైపు దాతలు ఉదారంగా బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నా బాధితుల్ని ఆదుకోవడంలో మాత్రం వెనకబడుతున్నారు. బాధితులు నేరుగా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.
Flood Relief: బుడమేరు వరదల్లో బాధితులకు పరిహారం అందలేదంటూ ఆందోళనలు బెజవాడలో నిత్యకృత్యంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రతి బాధితుడికీ పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా కింది స‌్థాయి ఉద్యోగుల్లో మాత్రం స్పందన కరువైంది. గత వారం సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు జరగడంతో ముఖ్యమంత్రి స్వయంగా మరోసారి బాధితులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వరద పరిహారం అందని వారు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్‌లో ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించినట్టు రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ప్రకటించారు.
వరద బాధితులకు అపోహలు వద్దని, అర్హులైన బాధితులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇప్పటికీ ఉందని చెప్పారు. ఏ ఒక్కరికీ సాయం రాలేదనే ప్రశ్నే లేకుండా పరిహారం పంపణీ చేశామని చెప్పిన సిసోడియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పరిహారం అందజేశామన్నారు. సాయం అందలేని అర్హులు ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు పరిశీలించి, అర్హులైతే తప్పకుండా సాయం అందజేస్తామన్నారు.
విజయవాడలో వరదలకు దెబ్బతిన్న ప్రతి బాధితుడికి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పరిహారం అందించిందని రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెల్లడించారు. ఎన్నడూ లేని విధంగా వరద బాధితులు తమకు న్యాయంగా అందాల్సిన పరిహారం పొందడానికి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించి, నష్టాన్ని అంచనా వేసి బాధితులకు పరిహారం అందజేసి అండగా నిలిచిందన్నారు.
నేరుగా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసే అవకాశం…
వరదల్లో నష్టపోయిన బాధితుల వివరాలన్నీ అత్యంత పారదర్శకంగా గ్రామ వార్డు సచివాలయల్లో ప్రదర్శించి వారికి పరిహారం అందజేశామని చెప్పారు. మొత్తం రూ.238.38 కోట్లను 1,46,318 మంది బాధితులకు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశామని తెలిపారు. వరద పరిహారం పొందాల్సిన బాధితుల్లో చాలా మంది తమ బ్యాంకు ఖాతాల్లో పొరబాట్లు ఉండటం, సరైన వివరాలు అందించకపోవడంతో వాటిని మళ్లీ తనిఖీ చేసి, ఆ పొరబాట్లన్నీ సరిదిద్ది, ఇతర సాంకేతిక సమస్యలను కూడా పరిష్కరించి నేరుగా బాధితుల ఖాతాల్లోనే నగదు జమ చేసినట్టు తెలిపారు
వరద బాధితులందరికీ నష్టపరిహారం అత్యంత పారదర్శకంగా అందించామని , ఇప్పటికీ కూడా ఎవరైనా అర్హులైన బాధితులకు ఎక్కడైనా పరిహారం అందలేదంటే వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముందని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నష్టం అంచనా వేసే సమయంలో ఇంట్లో లేని బాధితుల ఫిర్యాదుల నమోదుకు మరోసారి అవకాశం కల్పించినట్టు తెలిపారు.
బాధితులు తమ పేర్లను నమోదు చేసుకోవడం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను (Public Grievance Redressal System) ఏర్పాటు చేశామన్నారు. వరద బాధితులు పరిహారం అందకపోతే నేరుగా https://pgrs.ap.gov.in/ సైట్‌లో ఆధార్ కార్డు ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. రెవిన్యూ విభాగంలో వరద పరిహారంపై ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఫిర్యాదుల విభాగంలో వరద సాయం కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రత్యేక జీఓతో సడలింపులు..
జీఓ నెంబరు 5 ప్రకారం ప్రకృతి వైపరీత్యాల కారణంగా రెండు రోజులు అంతకంటే ఎక్కువ కాలం ఇళ్లు ముంపునకు గురై లేదా దెబ్బతిన్న కుటుంబాలకు మాత్రమే పరిహారం అందజేయడానికి వీలవుతుంది. అయితే దీనివల్ల వరద బాధితులు చాలా మంది నష్టపోయే ప్రమాదముండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితుల పక్షాన నిలబడి జీఓలో సడలింపులు చేసేలా ఆదేశాలిచ్చారన్నారు. ఎన్.డీ.ఆర్.ఎఫ్. నిబంధనల కిందకు రాని చిరు వ్యాపారులు, ఎం.ఎస్.ఎంఈలు, దెబ్బతిన్న వాహనాలు అన్నిటికీ పరిహారం అందేలా నిబంధనలకు సడలిస్తూ ప్రభుత్వం జీఓ నెంబరు 13ను జారీ చేసి బాధితులందర్నీ ఆదుకుందని సిసోడియా తెలిపారు.
పొంతన కుదరని మాటలు…
వరద పరిహారం చెల్లింపు విషయంలో వార్డు సచివాలయాల్లో కనీస స్పందన ఉండట్లేదు. రెవిన్యూ కార్యదర్శి స్థాయి అధికారులు సచివాలయాల్లో జాబితాలు ఉన్నాయని ప్రకటిస్తున్నా అక్కడ మాత్రం ఎలాంటి జాబితాలు అందుబాటులో లేవు. కలెక్టరేట్‌లో మాత్రమే వివరాలు ఉంటాయని వార్డు సచివాలయ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికీ వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. బాధితుల్ని గుర్తించడంలో ప్రాథమిక దశలో జరిగిన పొరపాట్లు వరద పరిహారం అందకపోవడానికి కారణంగా తెలుస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వారిని మొదటి అంతస్తులో ఉన్నట్టు, పై అంతస్తులో ఉన్న వారికి అసలు పరిహారమే ఇవ్వకపోవడం ఎక్కువగా జరిగింది. కొందరికి కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే పరిహారం అందింది.
పెంచిన పరిహారం వివరాలు..
గతంలో మాదిరిగా కాకుండా ఈ వరదల్లో నష్టపోయిన బాధితులకు పరిహారాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంచడమే కాకుండా ఆ ప్రకారమే బాధితులకు నష్ట పరిహారం చెల్లించింది. పెంచిన పరిహారం వివరాలు ఇవి:
* నీటమునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు రూ. 25,000/-
* నీటమునిగిన మొదటి అంతస్తు మరియు అంతకంటే పైఅంతస్తుల ఇళ్లకు రూ. 10,000/-
* చిన్న వ్యాపార (కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, సర్వీస్ షాపులు మొదలైనవి) షాపులకు రూ. 25,000/-
* రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలకు (రూ. 40 లక్షల టర్నోవర్) రూ. 50,000/-
* రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలకు (రూ. 40 లక్షల నుండి రూ. 1.50 కోట్ల టర్నోవర్) రూ. 1,00,000/-
* రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలకు (రూ. 1.50 కోట్లకు పైగా టర్నోవర్) రూ. 1,50,000/-
* దెబ్బతిన్న రెండు చక్రాల వాహనాలకు వాహనంకు రూ. 3,000/-
* దెబ్బతిన్న మోటరైజ్డ్ మూడు చక్రాల వాహనాలకు (ఆటో రిక్షాలు) రూ. 10,000/-
* పుష్ కార్ట్‌లకు రూ. 20,000/-.