DL Ravindra Reddy : వివేకా హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ ను విచారించాలి : డీఎల్
DL Ravindra Reddy : మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ ను విచారించాలని అన్నారు. సీబీఐ నిందితుల పేర్లు వెల్లడించడానికి ముందే.. కేసుకి సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని సీఎం జగన్ బయటపెట్టాలని కోరారు.
DL Ravindra Reddy : వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సీఎం జగన్ టార్గెట్ గా మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా అధికార పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోన్న ఆయన... శనివారం వైఎస్సార్ జిల్లా కాజీపేటలో మీడియాతో మాట్లాడుతూ... ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేరుగా సీఎం జగన్ పేరు ప్రస్తావిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ ను విచారించాలని అన్నారు. ఈ కేసులో సీబీఐ త్వరలోనే నిందితుల పేర్లు వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. ఈ కేసులో తనకి తెలిసిన విషయాలను సీఎం జగన్ ముందే చెప్పాలని.. అప్పుడైనా ఆయనకు మంచి పేరు వస్తుందంటూ డీఎల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
"ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే కోరుతున్నా. విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు, మీకు తెలుసు, మీ చిన్నాన్నను చంపింది ఎవరో. చంపించింది ఎవరో కూడా తెలుసు. మరో నాలుగైదు రోజుల్లో ఈ కేసులో సీబీఐ నిందితుల పేర్లు కూడా చెబుతుంది. అందుకని మీకు తెలిసిన విషయాన్ని, ఎవరు హత్య చేశారు, ఆ సుపారీ ఎవరు ఇచ్చారనే విషయాలు బయటకి చెప్పండి. అప్పుడు మీకైనా మంచి పేరు వస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ ను విచారణ చేస్తే గానీ నిజాలు బయటకు రావని నేను అనుకుంటున్నా. అది కూడా సీబీఐ చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చాక అది కూడా చేస్తారని ఆశిస్తున్నా" అని డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.
మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు డీఎల్. నియోజకవర్గంలో అవినీతిని అంతం చేస్తానంటూ మైదుకూరు ఎమ్మెల్యే చేస్తున్న ప్రతిజ్ఞలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మైదుకూరు మున్సిపాలిటీలో 7 సంవత్సరాలుగా అవినీతి జరుగుతోందని.. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని చెప్పారు. ఏనాడూ అవినీతిపై ప్రశ్నించలేదని.. పైగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
కొన్ని రోజుల క్రితం కడపలో మీడియాతో మాట్లాడిన డీఎల్ రవీంద్రా రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సింగిల్ డిజిట్ వచ్చినా గొప్పేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రమే ఏపీని కాపాడుతారని... రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఏపీని కాపాడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. గత ఎన్నికలకు ముందు తన ఇంటికి ప్రత్యేక దూతల్ని పంపించి మరీ పార్టీలో చేర్చుకున్నారని.. ఇప్పటికీ తాను వైఎస్సార్సీపీలోనే ఉన్నానని ప్రకటించారు. వైసీపీ వాళ్లేమీ తనను తీసేయలేదని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి పార్టీలో తాను ఉన్నానంటే అసహ్యంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచే తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
కడప జిల్లా మైదుకూరు నుంచి 1978 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు ఘన విజయం సాధించారు డీఎల్ రవీంద్రా రెడ్డి. మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. టీడీపీలోకి రావాలని ప్రయత్నించినప్పటికీ సమీకరణాలు కుదరలేదు. అనంతరం వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు డీఎల్. కానీ ఆ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవటంతో పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.