Deepavali Village : నా పేరే దీపావళి.. నా చరిత్ర నేనే చెబుతాను-diwali 2022 special deepavali name village in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Diwali 2022 Special Deepavali Name Village In Andhra Pradesh

Deepavali Village : నా పేరే దీపావళి.. నా చరిత్ర నేనే చెబుతాను

Anand Sai HT Telugu
Oct 23, 2022 09:29 PM IST

Deepavali 2022 : కొన్ని ఊర్ల పేర్లు వింతగా ఉంటాయి. ఇలాంటి పేరు కూడా ఉంటుందా అనుకుంటాం. ఊర్లకు పండగల పేర్లు ఉండటం మాత్రం అరుదుగా చూస్తుంటాం. ఏపీలో అలాంటి ఊరు ఉంది. అదే దీపావళి. అది పండగ కాదండోయ్. నిజంగానే ఆ ఊరి పేరే దీపావళి.

దీపావళి గ్రామం
దీపావళి గ్రామం

శ్రీకాకుళం నగరానికి మీరు కొత్తగా వెళ్తే.. అక్కడ కొంతమంది ఏదైనా వాహనాన్ని.. దీపావళికి వెళ్తుందా.. దీపావళికి వెళ్తుందా అంటూ అడుగుతారు. అలా అని మీరు ఇదేంటి పండగకు వెళ్లడం అనుకుంటే పొరబడినట్టే. తప్పులో కాలేసినట్టే. దీపావళి ఇప్పుడు పండగే. కానీ అక్కడో ఊరు ఉంది అదే పేరుతో. విచిత్రంగా ఉంది కదా. కానీ చాలా ఏళ్ల నుంచి ఆ పేరుతో ఊరు ఉంది. దానికి పెద్ద కథ కూడా ఉంది. ఆ కేథంటో దీపావళి ఊరి మాటల్లోనే విందాం.

ట్రెండింగ్ వార్తలు

నా పేరు దీపావళి. మాది ఉత్తరాంధ్ర... సరిగ్గా చెప్పాలంటే శ్రీకాకుళం దగ్గరన్నమాట. నాకు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గార మండలంలో నేనుంటాను. పండగ పేరు ఏంటి నాకు పెట్టారేంటి అని ఆలోచిస్తున్నారా? అందుకే నా కథ చెబుతాను. ఇలా పేరును ఊరికి పెట్టడం చూసి షాక్ అవ్వకండి. ఏదో అలా నాకు కలిసి వచ్చింది అంతే. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది లేండి.

నా పేరు విని ఈ మధ్య కాలంలో పెట్టారని మీరు అనుకుంటే.. నా మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు కాదు కొన్ని వందల ఏళ్ల క్రితమే నా పేరు దీపావళి అని పెట్టేశారు. రికార్డుల్లోనూ నా పేరు దీపావళి. నన్ను అదే పేరుతో పిలిచేయండి. అదే నాకు తృప్తి. మీకు కూడా కొత్తగా ఉంటుంది. సరేగాని.. నా కథ చెబుతా అని చెప్పా కదా. నా గురించి స్థానికంగా చెప్పుకొనే కథే నా కథ.

శ్రీకాకుళాన్ని అప్పట్లో ఓ రాజు పాలించేవారు. ఆయన గారా మండలం దగ్గర నుంచి గుర్రంపై వెళ్లేవారు. ఎప్పుడు నా నుంచే వెళ్లేవారు. ఓ రోజు వెళ్తూ.. వెళ్తూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో నాలో స్పృహ తప్పిపడిపోయారు. నేను కంగారు పడ్డాను. ఆయన స్పృహ తప్పిపోవడమే నాకు నా చరిత్ర చెప్పుకొనే వీలు కల్పించింది. రాజును చూసిన నా వాళ్లు పొలం పనులను వదిలి వేసి ఆయన దగ్గరకు వచ్చారు. ఆయనకు బాగు చేశారు. సపర్యలు చేశారు. అదే రోజు దీపావళి కావడంతో నాకు దీపావళి అనే నామకరణం చేశారు. ఇదే మా వాళ్లు ఎప్పుడు చెప్పే చరిత్ర. అలా వేరే వాళ్లతో చెబుతుంటే విన్నాను. మీకోసం నా కథ చెప్పాను.

ఇక ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లోనూ నా పేరు దీపావళిగానే ఉంది. నాలో.. అదేనండి.. నా పేరు మీద ఉన్న ఊరిలో సుమారు వెయ్యి మందికి పైగా జనాభా ఉన్నారు. నా పేరే దీపావళి అని ఉండటంతో గ్రామ ప్రజలు అన్ని పండగల్లోనూ దీపావళినే ఎక్కువగా జరుపుతారు. దీపావళి రోజున.. దీపావళి ఊరికి బంధువులు కూడా ఎక్కువనే వస్తారు. నా పేరు మీద ఉన్న పండగ ఎప్పుడు వచ్చినా.. చాలామందికి నేను గుర్తుకు వస్తాను. అదన్న మాట నా కథ. మీ అందరికీ Happy Deepavali..

IPL_Entry_Point