AP Ration Cards : రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్ - ఈ నెల పంచదార కూడా పంపిణీ..!-distribution of sugar along with other essentials from this month to ration card holders in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ration Cards : రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్ - ఈ నెల పంచదార కూడా పంపిణీ..!

AP Ration Cards : రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్ - ఈ నెల పంచదార కూడా పంపిణీ..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 01, 2024 08:22 AM IST

ఏపీలోని రేషన్‌ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సెప్టెంబరు నెలలో నిత్యావసరాలతో పాటు పంచదారను కూడా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా చంద్రబాబు సర్కార్ దృష్టిపెట్టింది.

ఏపీ రేషన్‌ కార్డుదారులకు కీలక అప్డేట్
ఏపీ రేషన్‌ కార్డుదారులకు కీలక అప్డేట్

రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల నుంచి పంచదార కూడ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు  పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్‌ వివరాలను వెల్లడించారు. ఇతర నిత్యావసరాలతో పాటు పంచదారనూ కూడా పంపిణీ చేస్తారని తెలిపారు.

అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కార్డుదారులకు కిలో రూ.13.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇతర కార్డుదారులకు అర కిలో రూ.17 చొప్పున అందించనున్నారు. పౌర సరఫరాల పంపిణీలో తూకం, నాణ్యతలో తేడాలుంటే 1967 నంబరులో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ఇక వచ్చే నెలలో కందిపప్పు, గోధమలను కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది.

త్వరలోనే కొత్త కార్డులు…!

మరోవైపు ఏపీలో చాలా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన చాలా మందికి రేషన్ కార్డులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేృతృత్వంలోని ప్రభుత్వం… కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టిపెట్టింది. సాధ్యమైనంత త్వరగా ఈ కార్డులను అందజేయాలని భావిస్తోంది.

కొత్త రేషన్ కార్డుల డిజైన్లను పరిశీలిస్తున్న పౌరసరఫరాల శాఖ…త్వరలోనే తుది డిజైన్ ను ఖరారు చేయనుంది. ఆ వెంటనే కార్డుల జారీ కోసం ప్రకటన వెలువడనుంది. అయితే ఇకపై రేషన్ కార్డు తీసుకోవాలనుకునే కొత్త జంట.. తప్పనిసరిగా మ్యారేజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పంపిణీ కేంద్రాలను పెంచాలని సర్కార్ నిర్ణయించింది. రేషన్ పంపిణీ మరింత సజావుగా సాగడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 29 వేలకుపైగా రేషన్ దుకాణాలు ఉండగా…. కొత్తగా మరో 4 వేల కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. నిర్దేశిత సమయంలో లబ్ధిదారుడికి రేషన్ అందించటమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించింది. ఎక్కువ రేషన్ కార్డులు ఏ పరిధిలో ఉంటే అక్కడ ఈ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

ప్రస్తుతం ఉన్న రేషన్ దుకాణాల్లో కొన్నింటికి ఇన్‌ఛార్డ్ డీలర్లు ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో… వాటిని గుర్తించాలని సర్కార్ నిర్ణయించింది. త్వరితగతిన ఆయా ఖాళీలను కూడా భర్తీ చేసే చర్యలను ప్రారంభించనుంది. ప్రాథమిక వివరాల ప్రకారం… 6 వేలకుపైగా డీలర్ల ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు.