NTR Bharosa Pensions: ఆగస్టు 31 శనివారమే ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ.. ఆదివారం సెలవు కావడంతోనే..
NTR Bharosa Pensions:ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్లు ఆగస్టు 31నే లబ్దిదారులకు అందించనున్నారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. శనివారం పెన్షన్ల పంపిణీ కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు.
NTR Bharosa Pensions: ఏపీలో సామాజిక పెన్షనర్లకు ప్రభుత్వం ఒక రోజు ముందే పెన్షన్లను అందించనుంది. సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే ఆగస్టు 31న పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతి నెలా 1వ తేదీన “ పేదల సేవలో” కార్యక్రమం క్రింద పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం, ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో లేకపోవడం వల్ల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31వ తేదీన అందకపోతే సెప్టెంబర్ 2వ తేదీన (సోమవారం) అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పథకం అమల్లో బాగంగా నూతన ప్రభుత్వం పెంచి సామాజిక భద్రతా ఫించన్లను శనివారం ఉదయం ఫించనుదారుల ఇంటి వద్దే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నున్న 65,18,496 మంది ఫించనుదారులు అందరికీ పెంచిన ఫించన్లను ఒక్క రోజులోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలని ఆదేశించారు.
ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వృద్దులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి ఫించను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచి జూలై 1 వ తేదీ నుంచి చెల్లిస్తున్నారు.
రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుండి రూ.15 వేలకు మరియు నాల్గో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఝకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.5 వేల నుండి 10 వేలకు ఫించను సొమ్ము పెంచిన విధంగా పంపిణీ చేయాలని సీఎస్ సూచించారు. మిగిలిన ఐదో కేటగిరీలోని వారికి గతంలో వలే ఎటు వంటి మార్పు లేకుండా యాధావిధిగా ఫించను సొమ్మును పంపిణీ చేయాల్సి ఉందన్నారు.
ఇళ్ల వద్ద నగదు రూపేణా పంపిణీ చేయాల్సిన ఫించను సొమ్మును 31 వ తేదీ శుక్రవారమే సంబందిత బ్యాంకు బ్రాంచ్ ల నుండి డ్రా చేసుకుని సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ఉదయం 6.00 గంటల నుండి ఫించనుదార్ల ఇంటి వద్దే ఫించను సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.
ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్ల చొప్పున ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని అప్పగించే విధంగా క్లస్టర్ల వారీగా మ్యాఫింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం కల్లా పూర్తి చేయాలన్నారు. సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండో రోజు కూడా ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు.
ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిష్, ఆర్బిఐఎస్ అథంటికేషన్ ఆధారంగానే ఫించను సొమ్మును పంపిణీ చేయాలని, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్ ను కూడా జారీ చేయాలని ఆదేశించారు. ఫించన్ల పంపిణిలో ప్రభుత్వానికి ఎటు వంటి మాట రాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.