Subsidy Seeds: ఏపీలో పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తనాల పంపిణీ, తక్షణం అమలుకు ఆదేశం
Subsidy Seeds: ఏపీలో జూలైలో కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 80శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయించింది.
Subsidy Seeds: గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తన పంపిణి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
రైతు మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టే రైతుల కష్టాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి గారు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జూన్ మరియు జూలై నెలలో సాధారణానికి మించి 48.6% అధిక వర్షపాతం నమోదు కావడం వలన ఇప్పటికే వరి ఊడ్పుల కోసం సిద్ధంగా వున్న సుమారు 1406 హెక్టర్ల నారుమళ్లు మరియు ౩౩వేల హెక్టర్లలో నాట్లు పూర్తైన వరి పంట ముంపునకు గురైందని అన్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మంత్రుల బృందం ముంపు ప్రాంతాల్లో పర్యటించింది. మంత్రుల బృందం, రాష్ట్ర స్థాయి అధికారులు, వివిధ జిల్లాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్షలు నిర్వహించి ముందస్తుగానే రైతుల అవసరాలకు తగినట్టుగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తయారు చేస్తున్నామన్నారు..
ముంపునకు గురై పంటలు దెబ్బతిన్న రైతులకు సత్వర సహాయంగా, వెనువెంటనే విత్తుకొనుటకు 80% రాయితీపై వరి పంట విత్తనాలను పంపిణి చేయటకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.
రైతులకు సాయం చేసేందుకు 6356 క్వింటాళ్ల వరి విత్తనాలను సంబంధిత జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాలలో ఉన్న రైతు సేవా కేంద్రాల వద్ద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణి చేయటానికి సిద్ధం చేశారు.
అధిక వర్షాల వలన నారుమళ్లు, వరి పంటలు దెబ్బ తిన్న రైతులు 80% రాయితీపై తమతమ గ్రామాల పరిధిలోని రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ పొందడంతో పాటు మంచి సాగు యాజమాన్య పద్ధతులు పాటించి, అధిక దిగుబడులు సాధించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.