ఏపీ రైతులకు కొత్త పట్టాదార్ పుస్తకాలను అందజేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రీ సర్వే పూర్తయిన భూ యజమానులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆగస్టు నాటికి అందచేయాలని ఆదేశించారు. వెంటనే ముద్రణ పూర్తి చేసి 21.86 లక్షల మందికి తొలివిడతగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.
ప్రతి పట్టాదారు పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి భూ యజమాని తమ భూమి వివరాలు వ్యక్తి గతంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. ఆధార్ కార్డు తో సమగ్ర భూ వివరాలు రావాలని…. తమ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలని చెప్పారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ధరఖాస్తుల పరిష్కారంపై ప్రైవేటు టీంతో ఆడిటింగ్ చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అప్పుడు సమస్యల పరిష్కారం పై ఒక అంచనా వస్తుందన్నారు. అలాగే ప్రజలు అనధికారికంగా ఉంటున్న అభ్యంతరం లేని ప్రాంతాల్లో రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని… డిసెంబర్ లోపు ఈ తరహా అన్ని ధరఖాస్తులు పరిశీలించి రెగ్యులరైజేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
వారసత్వంగా వచ్చే భూములును పంచుకునే విషయంలో రూ.100 చెల్లించి సక్సెషన్ చేసుకోవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ భూమి విలువ రూ. 10 లక్షల విలువైన ల్యాండ్ అయితే రూ. 100...ఆ పైన విలువైన ల్యాండ్ అయితే రూ. 1000 చెల్లించి సక్సెషన్ చేసుకోవచ్చని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి గ్రామ వార్డు సిబ్బందికి అవసరమైన అధికారాలు ఇవ్వాలన్నారు. అలాగే రీసర్వే 2.0కు ఆర్థిక సమస్య రాకుండా చూడాలని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 2027 రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రీ సర్వే 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ అనునిత్యం పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.గ్రామ స్థాయి ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సాంకేతికతను ఉపయోగించుకుని క్షేత్ర స్థాయిలో ఫలితాలు వచ్చేలా చూడాలని సూచించారు. భూ సమస్యలు, ప్రజల అర్జీలు, రెవెన్యూ శాఖలో సేవలు సులభతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ అంశాలపై అధికారులను పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆదేశించారు.
ప్రజల అర్జీపై అధికారులు మాట్లాడుతూ“ కూటమి ప్రభుత్వ వచ్చిన తరువాత నిర్వహించిన 17600 రెవెన్యూ సదస్సుల్లో 1.85 లక్షల దరఖాస్తులు ప్రజల నుంచి వస్తే వీటిలో 1,85,049 పరిష్కారం అయ్యాయి. ఇంకా 668 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. అలాగే ఏడాదిలో రెవెన్యూ శాఖలకు సంబంధించి 4,50,603 గ్రీవియన్స్ వచ్చాయి. వీటిలో 3,99,645 పరిష్కారం చూపాం. ఆటో మ్యూటేషన్స్ లో 1.93 లక్షలు ధరఖాస్తులు వస్తే...వాటిలో 1.77 లక్షలు పరిష్కరించాం. ప్రజల అర్జీల పరిష్కారం విషయంలో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తున్నాం"అని సీఎం చంద్రబాబుకు వివరించారు.
రెవెన్యూ శాఖ తీసుకువస్తున్న కొత్త పోర్టల్ గురించి రివ్యూ లో అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. రాష్ట్ర పరిధిలో ఏరకమైన ల్యాండ్ ను అయినా ఆ పోర్టల్ ద్వారా ఫిజికల్ గా చూడవచ్చు. పోర్టల్ లో సదరు ల్యాండ్ ను మార్క్ చేయగానే ఆ ల్యాండ్ యజమాని నుంచి సమస్త వివరాలు అక్కడ కనిపిస్తాయి. హద్దులతో సహా ఆ ల్యాండ్ వివరాలు తెలుసుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఉన్న అడవులు, ప్రభుత్వ భూములు, రోడ్లు, నీటి ప్రాంతాలు, చెరువులు, ఆక్రమణల్లో ఉన్న స్థలాలు, వివాదాల్లో ఉన్న స్థలాల వివరాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఎవరైనా భూమి అమ్మాలన్నా కొనాలన్నా కూడా పక్కాగా ఆ ల్యాండ్ ఎవరి పేరుతో ఉందో చూడా చూడవచ్చు అని అధికారులు సూచించారు.
ఇతర శాఖలతో కూడా సమన్వయం చేసుకుని ఈ పోర్టల్ ను సమగ్రంగా తీసుకురావాలని సిఎం సూచించారు. దీనికి ఆలోచించి మంచి పేరు పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.