AP Heavy Rains : అలర్ట్.. అలర్ట్.. ఈ జిల్లాల్లో అతి తీవ్ర భారీ వర్షాలు, తస్మాత్ జాగ్రత్త!
AP Heavy Rains : ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. ఏపీ ప్రజలకు గండంగా మారింది. శుక్రవారం రాత్రి వరకు ఇది తుపానుగా బలపడనుంది. దీని ప్రభావంతో.. పలు జిల్లాల్లో తీవ్ర అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదులుతుంది. శుక్రవారం రాత్రి వరకు తుపానుగా బలపడే అవకాశం ఉంది. శనివారం మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాల సమీపంలో.. కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరికి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని.. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఈ తుపాను ప్రభావంతో.. దక్షిణ కోస్తా లో శుక్రవారం, శనివారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం నాడు కొన్నిచోట్ల అతి తీ వ్రభారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీ - అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మిగిలినచోట్ల ఆదివారం వరకు విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
'తీరం వెంబడి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 320 కిలోమీటర్లు, చెన్నైకి 340 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి' అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై తక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపనుంది.
తెలంగాణలో..
తెలంగాణలో రేపట్నుంచి (నవంబర్ 30) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నాడు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
డిసెంబర్ 1వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
డిసెంబర్ 2వ తేదీన పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. ఇక 3వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని, ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.