భర్త పైశాచికం.. దివ్యాంగురాలైన భార్యపై దాడి-disabled wife allegedly assaulted by husband ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  భర్త పైశాచికం.. దివ్యాంగురాలైన భార్యపై దాడి

భర్త పైశాచికం.. దివ్యాంగురాలైన భార్యపై దాడి

HT Telugu Desk HT Telugu
Jun 18, 2024 05:33 PM IST

దివ్యాంగురాలైన భార్యపై ఓ వ్యక్తి పాశవికంగా దాడిచేశాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రామంలోని జగనన్న కాలనీలో ఈ ఘటన జరిగింది.

భార్యపై భర్త పాశవిక దాడి
భార్యపై భర్త పాశవిక దాడి

పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రామంలోని జగనన్న కాలనీలో ఓ దివ్యాంగురాలిపై ఆమె భర్త దాడి చేశాడు. దివ్యాంగురాలైన షేక్ షమీమున్నీకి సైదాతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. భర్త సైదా రోజూ విపరీతంగా మద్యం సేవించి భార్య, పిల్లలను చిత్ర హింసలకు గురిచేసేవాడు. వారిని రోజూ కొట్టేవాడు. భార్య వద్ద నున్న బంగారం, వెండి బలవంతంగా కొట్టి లాక్కొనేవాడు‌. అలాగే పిల్లలను కొట్టేవాడు.

భార్య, పిల్లలు వద్ద నుంచి తీసుకున్న బంగారం, వెండి ఆభరణాలను అమ్ముకొని ఆ డబ్బులతో మద్యం తాగేవాడు‌. ఉదయం నుంచి రాత్రి వరకు తాగుతునే ఉండేవాడు. గత నాలుగేళ్లుగా భార్య, పిల్లలకు దూరంగా ఉన్నాడు. అయితే ఇటీవల తిరిగి ఇంటికి వచ్చిన భర్త సైదా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో విచక్షణ రహితంగా భార్యపై దాడికి దిగాడు. భార్యను కింద పడేసి తల పగులగొట్టి పారిపోయాడు‌

దీంతో రక్తం కారుతూ లబోదిబో అంటూ షేక్ షమీమున్నీ 100కు ఫోన్ చేసింది. ఈనేపథ్యంలో షీ టీమ్ అక్కడికి చేరుకుంది. ఆమెను ‌అర్థరాత్రి గురజాల హాస్పిటల్ కు తరలించారు. అక్కడ షీ టీమ్ ఆమెకు చికిత్స చేయించింది. తన భర్త వల్ల తనకు ప్రాణ హాని ఉందని, అందువల్ల తనకు సత్వరమే న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు విన్నవించింది. అలాగే నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, శిక్షించాలని ఫిర్యాదు చేసింది.

- జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel