Guntur Politics : విడదల రజిని వర్సెస్ లావు శ్రీకృష్ణదేవరాయలు.. మరింత ముదిరిన డైలాగ్ వార్!-dialogue war between vidadala rajini and lavu srikrishna devarayalu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur Politics : విడదల రజిని వర్సెస్ లావు శ్రీకృష్ణదేవరాయలు.. మరింత ముదిరిన డైలాగ్ వార్!

Guntur Politics : విడదల రజిని వర్సెస్ లావు శ్రీకృష్ణదేవరాయలు.. మరింత ముదిరిన డైలాగ్ వార్!

Guntur Politics : విడదల రజిని వర్సెస్ లావు శ్రీకృష్ణదేవరాయలు.. డైలాగ్ వార్ మరింత ముదిరింది. తన కాల్ డేటా తీశారని రజిని సంచలన ఆరోపణలు చేయగా.. తాజాగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు స్పందించారు. తన ఇంట్లోనూ మహిళలు ఉన్నారని.. తామెందుకు కాల్ డేటా తీయిస్తామని ప్రశ్నించారు.

లావు శ్రీకృష్ణదేవరాయలు

గుంటూరు జిల్లా రాజకీయం మళ్లీ వేడెక్కింది. విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో.. ఆమె సంచలన ఆరోపణలు చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన ఫోన్ కాల్ డేటా తీయించారని ఆరోపించారు. 2021 సెప్టెంబర్‌లో తన సిబ్బంది, వ్యక్తిగత ఫోన్ కాల్ డేటాను ఓ సీఐ, డీఎస్పీతో ట్రాక్ చేయించారని వివరించారు. ఈ ఆరోపణలపై లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందించారు.

మా ఇంట్లోనూ మహిళలున్నారు..

'నేను కాల్‌ డేటా తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్నారు. మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు. 40 ఏళ్లుగా విజ్ఞాన్‌ సంస్థలు నడుపుతున్నాం. ఏపీలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు. అమరావతిలో కూడా భూమి కోసం దరఖాస్తు చేయలేదు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలంవేస్తే.. పాల్గొని అధిక ధర చెల్లించి భూమి తీసుకున్నాం. వేలానికి, కేటాయింపుకి మధ్య చాలా తేడా ఉంది. చాలా మంది దగ్గర విడదల రజిని డబ్బులు తీసుకున్నారు. 10 రోజుల క్రితం కేసును ఆపాలని.. ఓ వ్యక్తిని నా దగ్గరికి రాయబారానికి పంపారు' అని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.

లావు డైరెక్షన్‌లోనే..

'రెడ్‌బుక్‌ పాలనలో భాగంగా నన్ను టార్గెట్ చేశారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తి. నాపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారులను నేను కలవలేదు. ఎంపీ కృష్ణదేవరాయలు డైరెక్షన్‌లోనే కేసులు పెడుతున్నారు. గురజాల డీఎస్పీ, సీఐలకు లంచం ఇచ్చి.. ఎంపీ నా కాల్‌ డేటాను తీయించారు' అని విడదల రజిని ఆరోపించారు.

కేసులను ఎదుర్కొంటా..

'నా మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు చేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు పన్నుతున్నారు. అక్రమ కేసులే మీ లక్ష్యమైతే వంద కేసులు ఎదుర్కొంటా. విష ప్రచారాలే లక్ష్యమైతే వేయి ప్రచారాలు ఎదుర్కొంటా. నా నిజాయితీ, సత్యం, ధర్మమే నా ధైర్యం. నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో.. చూడటానికి నేను ఎదురుచూస్తూ ఉంటా' అని విడదల రజిని ట్వీట్ చేశారు.

కేసు ఏంటి..

పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమానులను బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారని రజినిపై అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆమెపై ఏసీబీ చర్యలకు దిగింది. తాజాగా కేసు నమోదు చేసిన ఏసీబీ.. విడదల రజినిని ఏ1గా చేర్చింది. ఆమెకు నోటీసులు జారీ చేయటంతో పాటు విచారణకు పిలిచే అవకాశం ఉంది. విడుదల రజనితో పాటు అప్పటి గుంటూరు ఆర్‌వీఈవో((రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి)గా ఉన్న ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా, మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం