ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు సిట్ ఆఫీసర్లు ప్రకటించారు. ఇప్పటికే వీరి సెల్‍ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి నుంచి కీలక సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టిన సమాచారం. గత ప్రభుత్వంలో ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈ ఇద్దరి అరెస్టుతో తర్వాత టార్గెట్ ఎవరనే చర్చ జరుగుతోంది.
2019 నుండి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ లిక్కర్ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో దాదాపు రూ.3,200 కోట్ల నుండి రూ.3,500 కోట్ల వరకు అక్రమంగా సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చి.. కొన్ని తక్కువగా తెలిసిన బ్రాండ్లను ప్రోత్సహించి, బాగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లను నిలిపివేసిందని ఆరోపణలు ఉన్నాయి. దీనికి బదులుగా ఆయా కంపెనీల నుండి భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారనే ప్రచారం జరిగింది.
ఈ కేసులో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇంకా పలువురు వైసీపీ నాయకులు, అధికారులు, షెల్ కంపెనీలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. వీరిలో విజయసాయి రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం విధిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక, 2019 అక్టోబర్‌లో కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం.. రాష్ట్రంలోని దాదాపు 3,500 మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. దుకాణాల సమయాన్ని తగ్గించారు. మద్యం ధరలను పెంచారు.
రాజ్ కసిరెడ్డి ప్రతి ఐదు రోజులకోసారి.. అమ్మకాల డేటాను తెప్పించుకుని, ఎంత ముడుపులు వసూలు చేయాలో లెక్కించి మధ్యవర్తుల ద్వారా డబ్బును చేరవేశారనే టాక్ ఉంది. ఈ డబ్బు వైసీపీ నాయకులకు చేరిందని ఆరోపణలు ఉన్నాయి. 2019- 2024 మధ్యం మెక్‌డోవెల్స్, సీగ్రామ్స్ వంటి ప్రసిద్ధ బ్రాండ్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. కొన్ని కొత్త బ్రాండ్లకు మాత్రం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే ప్రచారం జరిగింది.
ఈ కేసును ఏపీ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం టేకప్ చేసింది. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి తోపాటు పలువురిని సిట్ అరెస్టు చేసింది. తాజాగా.. ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను అరెస్టు చేశారు. వీరికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే.. వైసీపీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని వాదిస్తోంది. సిట్ ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు చూపలేదని ఆ పార్టీ వాదిస్తోంది.
సంబంధిత కథనం