Padmavati Park: భక్తుల ప్రాణాలు బలిగొన్న పద్మావతి పార్కు,స్థానికులకు టోకెన్లు కేటాయించే కేంద్రానికి స్థానికేతరుల తరలింపు
Padmavati Park: టీటీడీ నిర్లక్ష్యం, పోలీసుల అలసత్వం తిరుపతిలో జరిగిన ఘోర ప్రమాదానికి కారణం అయ్యాయి. తిరుపతి నగర ప్రజలకు టోకెన్లు జారీ చేసే కేంద్రంలోకి భారీ ఎత్తున స్థానికేతరులను అనుమతించడమే దుర్ఘటనకు కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి.
Padmavati Park: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే ముక్తి లభిస్తుందనే భక్తుల విశ్వాసానికి తగ్గట్టుగా టీటీడీ ఏర్పాట్లు చేయకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జరిగిన బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద జరిగిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు ఉత్తరాంధ్రకు చెందిన వారు కాగా మరొకరు బళ్ళారి చెందిన మహిళ ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన మహిళలు ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఏం జరిగిందంటే…?
- బైరాగి పట్టెడలో ఉన్న రామానాయుడు స్కూల్ ప్రాంగణంలో ఏటా వైకుంఠ ద్వార దర‌్శనం టిక్కెట్లను జారీ చేస్తారు.
- ఇక్కడ కేవలం తిరుపతి నగర ప్రజలకు మాత్రమే గతంలో టోకెన్లను జారీ చేసేవారు. ఏటా వైకుంఠ ద్వార దర్శన సమయంలో లక్షలాది మంది తిరుమలకు తరలి వస్తారు. భక్తులు రోజుల తరబడి క్యూలలో నిలబడి ఉండాల్సి వస్తుండటంతో టోకెన్ల జారీ విధానానికి శ్రీకారం చుట్టారు.
- తిరుపతి నగరంలో దాదాపు 90కౌంటర్లను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనాల కోసం వచ్చే భక్తులు ముందే టైమ్ స్లాట్ టోకెన్లను పొందాల్సి ఉంటుందని టీటీడీ విస్తృత ప్రచారం చేసింది.
- టైమ్ స్లాట్ టోకెన్లు ఉన్న భక్తుల్ని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారని, తిరుపతిలోని పది ప్రాంతాల్లో టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు జారీ చేస్తారని పత్రికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
- టోకెన్ల జారీకి జీవకోన జడ్పీ హైస్కూల్, తిరుపతి, 2. ఎమ్మార్‌పల్లి హైస్కూల్ తిరుపతి, 3. రామచంద్ర పుష్కరిణి, 4.రామానాయుడు హైస్కూల్, బైరాగిపల్లి, తిరుపతి, 5. ఇందిరా మైదానం, తిరుపతి, 6. శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతి, 7.విష్ణు నివాసం, తిరుపతి, 8. భూదేవి కాంప్లెక్స్, తిరుపతితో పాటు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టైమ్ స్లాట్ టోకెన్లు జారీకి ఏర్పాట్లు చేశారు.
- జనవరి 9 వ తేదీ ఉదయం 5గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేస్తారు. తొలి రోజు 10,11,12 తేదీలకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తారు. మూడు రోజుల కోటా పూర్తయ్యే వరకు టోకెన్లు జారీ చేస్తారు.
- 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దర్శనాల టోకెన్లను శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో మాత్రమే జారీ చేస్తారు. శ్రీవారి మెట్టు కౌంటర్లను 19వ తేదీ వరకు మూసేస్తారు.
- బైరాగిపల్లె రామానాయుడు స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో గతంలో స్థానికులకు మాత్రమే టోకెన్లు జారీ చేసేవారు. ఈ ప్రాంతంలో ఉండే కేంద్రం గురించి స్థానికేతరులకు పెద్దగా తెలియదు. ఈసారి ముందే ప్రచారం చేయడంతో బుధవారం తెల్ల వారు జామునే వేలాది ముందు పాఠశాల వద్దకు చేరుకున్నారు.
- బుధవారం ఉదయం క్యూలైన్లలోకి జనాన్ని అనుమతించక పోవడంతో పోలీసులు వారందరిని పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి పంపారు. సాయంత్రానికి అక్కడ పదివేలమంది వరకు పోగయ్యారు.
- భక్తుల్ని పార్కులోకి ఉంచేసి గేట్లను మూసేయడంతో లోపల ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. బుధవారం రాత్రి 7.30-8 గంటల ప్రాంతంలో ఓ మహిళ అస్వస్థతకు గురైంది.
- అప్పటికే తమను బయటకు పంపాలని కొందరు భక్తులు పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన మహిళను బయటకు తీసుకు వచ్చేందుకు గేట్లను తెరిచారు. ఆ సమయంలో భక్తులను పోలీసులు అప్రమత్తం చేయలేదు. పార్కు లోపల ఉన్న వారికి గేట్లు ఎందుకు తెరుస్తున్నారో తెలియక టోకెన్ల కోసం క్యూ లైన్లలోకి పంపుతున్నారని భావించారు.
- పార్క్ గేటు నుంచి క్యూ లైన్లలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా జనం తోసుకు వెళ్లారు. పద్మావతి పార్కులో వాకింగ్ ట్రాక్ నిర్మించి ఉంది. ట్రాక్‌కు కింద ఉన్న లాన్‌కు అడుగున్నర ఎత్తు తేడా ఉంది. ట్రాక్ మీదుగా గేటు బయటకు రావాల్సి ఉంటుంది. గేటు వైపుకు వచ్చే క్రమంలో లాన్ నుంచి పైకి ఎక్కే క్రమంలో కొందరు కిందపడిపోయారు. జనం తోసుకుంటూ వారి మీదుగా వెళ్లిపోయారు.
- ఆ సమయంలో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. దాదాపు 15నిమిషాల పాటు తీవ్ర తొక్కిసలాట తర్వాత కింద పడిన వారిని అతికష్టమ్మీద బయటకు తీసుకు రాగలిగారు. గేట్లను తెరవడంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే ఈ అనర్థానికి కారణమైంది.
- 41మందికి గాయాలు..
తిరుపతి తొక్కిసలాటలో 41మంది గాయపడ్డారని, వారిని స్విమ్స్, రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని, క్షతగాత్రుల్లో అత్యధికుల్ని సాయంత్రంలోగా డిశ్చార్జి చేయనున్నట్టు చెప్పారు. గాయపడిన వారిలో ఇద్దరు ముగ్గురికి మాత్రమే చికిత్స కొనసాగించాల్సిన స్థితిలో ఉన్నారన్నారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు తప్ప మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఇప్పటి వరకు 20మందిని డిశ్చార్జి చేసినట్టు తెలిపారు.
ఎస్పీ జేఈఓలను సస్పెండ్ చేయాలని డిమాండ్
తిరుపతి ఎస్పీ , టీటీడీ జేఈఓ వెంకన్న చౌదరిలని సస్పెండ్ చేయాలని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు గుడి కట్టుకుని ఆయనకు సేవ చేసుకోవాలన్నారు. వెంకటేశ్వరుడి ఆలయంలో భక్తుల మనోభావాలను పరిరక్షించడానికి ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన పనిచేయకుండా, వారంతా చంద్రబాబు సేవలో తరిస్తున్నారని భూమన ఆరోపించారు.లా అండ్ ఆర్డర్ అదుపు చేయాల్సిన పోలీసులు, తమ బాధ్యతల్ని విస్మరించడం వల్ల భక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
పవనానంద స్వామి ఎక్కడ… మృతులకు కోటి పరిహారం చెల్లించాలి.
సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని తిరుపతిలో వీరతాడు వేసుకుని తిరిగిన పవనాననంద స్వామి, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని, సనాతన ధర్మాన్ని మీ ఆలోచన రీతిలో తునాతునకలు చేస్తారో చెప్పాలన్నారు.
గేమ్ ఛేంజర్ ఈవెంట‌్‌లో ఇద్దరు చనిపోతే, రోడ్లు బాగోలేకపోవడానికి వైసీపీ మీద ఆరోపణలు చేశారని, ఇప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సనాతన ధర్మం పేరుతో మాయమాటలు చెబుతారు, ఆచరణలో అమలు చేయరని విమర్శించారు. చంద్రబాబు దేవుడితో పెట్టుకున్నారని, రాజకీయ వనరుగా, పావుగా వాడుకుని జగన్ మీద అభాండాలు వేసి, తిరుమల అపవిత్రం అయ్యిందని రాజకీయం చేశారని, తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందనే దుర్మార్గపు ప్రచారాలకు ఇప్పుడు దేవుడే కన్నెర్ర చేశాడని మండిపడ్డారు.
తిరుమల ఆలయ పవిత్రత తాము కాపాడినంతగా ఇంకెవరు కాపాడలేదన్నారు. దమ్ముంటే తమతో చర్చకు సిద్దపడాలన్నారు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు చేసిన ఆరోపణల గురించి బహిరంగ చర్చకు తాము సిద్ధమని, చంద్రబాబు మాయ మాటలు తగ్గించి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకోకుండా సరైన చర్యలు చేయాలన్నారు.
తిరుపతి ఘటనకు బాధ్యులైన ఈవోను బదిలీ చేయాలి, ఇతర అధికారుల్ని సస్పెండ్ చేయాలని మృతుల కుటుంబాలకు కోటి రుపాయల పరిహారం అందించాలని గాయపడిన వారికి రూ.20లక్షల పరిహారం చెల్లించాలని భూమన డిమాండ్ చేశారు. పరామర్శలతో కాలం గడిపేయడం సరికాదని తిరుపతిలో జరిగినవి ప్రభుత్వ హత్యలని ఆరోపించారు.