Tirumala : తిరుమల కొండపై అపచారం.. కోడిగుడ్డు, పలావ్‌తో వచ్చిన భక్తులు.. టీటీడీ అలర్ట్!-devotees arrive at tirumala temple with egg rice and pulao ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : తిరుమల కొండపై అపచారం.. కోడిగుడ్డు, పలావ్‌తో వచ్చిన భక్తులు.. టీటీడీ అలర్ట్!

Tirumala : తిరుమల కొండపై అపచారం.. కోడిగుడ్డు, పలావ్‌తో వచ్చిన భక్తులు.. టీటీడీ అలర్ట్!

Basani Shiva Kumar HT Telugu
Jan 18, 2025 04:13 PM IST

Tirumala : తిరుమల.. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. అలాంటి క్షేత్రానికి కొందరు భక్తులు కోడిగుడ్లు, పలావ్‌ను తీసుకొచ్చారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టీటీడీ అలర్ట్ అయ్యింది. సెక్యూరిటీని మరింత టైట్ చేసింది.

తిరుమల కొండపై అపచారం
తిరుమల కొండపై అపచారం

తిరుమల కొండపై అపచారం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుపతిలో దిగి.. మెట్ల మార్గం ద్వారా తిరుమలపైకి నడిచి వచ్చారు. వస్తూ వస్తూ ఆ భక్తులు కోడి గుడ్లు, పలావ్‌ను తీసుకొచ్చారు. బస్టాండ్ ఆవరణలో కోడిగుడ్డు, పలావ్ తింటుండగా.. కొందరు శ్రీవారి భక్తులు గుర్తించారు.

ఆహారం సీజ్..

వారు కోడిగుడ్లు, పలావ్‌ తింటున్న విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, వారు తింటున్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషేధించామని వారికి వివరించారు. మరోసారి ఇలాచేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం గురించి తెలియగానే.. టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. సెక్యూరిటీని టైట్ చేశారు.

వీడియో వైరల్..

తిరుమల కొండపై కోడిగుడ్లు, పలావ్ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇష్యూపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. తిరుమల ప్రతిష్ట మసకబారుతోందని ఆరోపిస్తోంది. బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అటు తనిఖీ కేంద్రాల డొల్లతనాన్ని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. తనిఖీ కేంద్రం దాటుకొని నిషేధిత ఆహారం ఎలా తిరుమలకు వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హిందుత్వ సంఘాల ఆందోళన..

మరోవైపు అలిపిరి జూపార్క్ రోడ్డులో ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. టీటీడీ పరిపాలన భవనం ఎదుట హిందూత్వ సంఘాలు నిరసన చేపట్టారు. ఏడు కొండలకు వెన్ను పోటు పొడవద్దంటూ నినాదాలు చేశారు. సనాతన హిందూ ధర్మం కోసం తిరుపతిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

వాహనాల రద్దీ..

ఇటు అలిపిరి దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. సప్తగిరి చెక్‌ పాయింట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. రేపటితో శ్రీవారి వైకుంఠద్వార దర్శనం ముగియనుంది. ఈ నేపథ్యంలో.. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది.

Whats_app_banner