Tirumala: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. కొండపై అందుబాటులో రూములు
Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు రూ.50, రూ.100 రూములు అందుబాటులో ఉన్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. సోమవారం శ్రీవారిని 76,910 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,320 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.26 కోట్లు అని అధికారులు వివరించారు.
అందుబాటులో రూములు..
తిరుమల కొండపై 50, 100 రూపాయల రూములు అందుబాటులో ఉన్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 7:30 గంటల సమయానికి 566 రూములు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మొత్తం 1500 రూములు ఉండగా.. వాటిల్లో 934 బుక్ అయ్యాయని చెప్పారు. రూ.1000, రూ.1418 రూములు అందుబాటులో లేవు. మొత్తం 20 రూములు ఉండగా.. 20 బుక్ అయ్యాయని అధికారులు వెల్లడించారు.
అధికారుల తనిఖీ..
తిరుమలలోని లడ్డూ కౌంటర్లు, ఆలయ మూఢ వీధుల్లో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం తనిఖీలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. మూఢవీధుల్లో పరిశుభ్రత పాటించాలని స్పష్టం చేశారు. సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.