విజయవాడ ఇంద్రకీలాద్రి.. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కానీ ఇప్పుడు దోపిడీకి కేంద్రంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ వ్యాపారులు, సిబ్బంది భక్తుల జేబులకు చిల్లు పెడుతున్నారు. కొండపైకి ఎక్కడం మొదలు.. కిందకు దిగే వరకు.. ప్రతీచోట డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అమ్మవారి కొండపైకి వెళ్లడానికి ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. కానీ.. అవి సరిపడా లేవు. ఎప్పుడో వస్తున్నాయి. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో.. భక్తులు వేడికి తాళలేక.. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వారధి కింద నుంచి కొండపైకి వెళ్లడానికి సెవెన్ సీటర్ వాహనాలను నడుపుతున్నారు. వీటిల్లో ఎక్కించడానికి అక్కడ విధులు నిర్వహించే ఆలయ సిబ్బంది సహకరిస్తున్నారు. అటు ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఉండే సిబ్బంది కూడా.. భక్తుల వాహనాలకు ఆంక్షలు పెడుతున్నారు. కానీ.. కొండపైకి వచ్చే ప్రైవేటు వాహనాలను మాత్రం ఆపడం లేదు. వీటిల్లో ఒక్కో భక్తుడి నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు.
ఏదోలా కొండపైకి వచ్చిన భక్తులు.. అక్కడా దోపిడీకి గురవుతున్నారు. సాధారణంగా రూ.20 ఉండే వాటర్ బాటిల్‌ను రూ.30కి విక్రయిస్తున్నారు. ఇందేటని ప్రశ్నిస్తే.. ఇష్టం ఉంటే కొనుక్కో.. లేదంటే లేదు.. అని గద్దిస్తున్నారు. కూల్ డ్రింక్స్ విక్రయాల పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొండపైన ఫొటోలు తీసేవారు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు.
గతంలో మాదిరిగా కాకుండా.. అమ్మవారి కొండపైకి ఎక్కడానికి లిఫ్ట్ ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులను లిఫ్ట్‌లో పైకి తీసుకెళ్లాలి. కానీ.. అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. డబ్బులు వసూలు చేసి.. లిఫ్ట్‌లో ఎక్కిస్తున్నారనే ఆరోపమలు ఉన్నాయి. ఇటు కొండపైనుంచి కిందకు దిగడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో బస్సులు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేటు వాహన యజమానులు అక్కడికి వచ్చి.. భక్తులకు మాయమాటలు చెప్పి.. వాహనాల్లో ఎక్కిస్తున్నారు.
ఇలా ప్రతీచోట.. భక్తులు దోపిడీకి గురవుతున్నారు. అక కొండపైకి ఎక్కాక.. గతంలో మాదిరిగా లేదు. ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. దర్శనం తర్వాత భక్తులు బయటకు రావడానికి కూడా సరైన మార్గం లేదు. లడ్డూ ప్రసాదం ఎక్కడ విక్రయిస్తారో తెలియక చాలామంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. సిబ్బందిని అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు.
భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పిస్తారు. ఇక్కడైతే.. మామూలు దోపిడీ లేదు. ఒక్కో భక్తుడి దగ్గర ఆలయ అధికారులు రూ.40 తీసుకొని టోకెన్ ఇస్తున్నారు. కానీ.. తీరా అక్కడికి వెళ్లాక రూ.100 ఇస్తేనే తలనీలాలు తీస్తున్నారు. ఇవ్వకపోతే.. బూతులు తిడుతున్నారు. ఆగమాగం తలనీలాలు తీస్తున్నారు. పుట్టు వెంట్రుకలు అయితే.. ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నారు.
సంబంధిత కథనం