Devipatnam Gandi Pochamma Temple : చుట్టూ అడవి మధ్యలో గండి పోచమ్మ తల్లి ఆలయం ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. ఈ ఆలయాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే. ఆ తల్లి అంత మహాత్యమైనదని భక్తులు భావిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పచ్చని తివాచీ పరిచినట్లు కనిపించే ప్రకృతి, మరోవైపు సవ్వడి చేసే జలపాత ధారలతో సెలయేరు మధ్యలో గండి పోచమ్మ ఆలయం ఉంటుంది.
పూర్తిగా అటవీ ప్రాంతంగా ఉండే ప్రస్తుత అల్లూరి సీతారామ రాజు జిల్లా దేవీపట్నం సమీపంలో గండి పోచమ్మ ఆలయం దర్శనమిస్తుంది. ఈ ప్రాంతం నుంచి ప్రతినిత్యం పర్యటకులు బోటు షికారు చేస్తూ ఉంటారు. అయితే వర్షాకాలం నేపథ్యంలో బోటు షికారును అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు అధిక వర్షాలకు ఇక్కడి అమ్మవారి ఆలయం దాదాపు నీటితో మునిగిపోతూ ఉంటుంది. ఇటీవలి వచ్చిన వరదలతో కూడా అమ్మవారి ఆలయం మునిగిపోయింది.
నీటి ఒడ్డున ఉన్న గండి పోచమ్మ అమ్మవారు ఆషాడ మాసంలో వరాల తల్లిగా భక్తులు ఆరాధిస్తుంటారు. భక్తులు ప్రతి రోజూ దర్శించుకుంటారు. అయితే ఆషాడంలో అమ్మవారిని దర్శిస్తే, తల్లి ఆశీస్సులు తప్పక మనపై ఉంటాయని భక్తులు నమ్ముతారు. ఈ క్షేత్ర ఆనవాయతీ ప్రకారం అమ్మవారికి పొంగళ్లు నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారు.
ఆలయం ఆవరణలో గల ఎత్తైన పచ్చని చెట్టు కింద భక్తులంతా కుటుంబాల సమేతంగా వంట వార్పు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరిస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఆషాడమాసంలో అమ్మవారు శాకాంబరీ దేవిగా భక్తులకు దివ్య దర్శనం ఇస్తుంటారు. మరుమూల అటవీ ప్రాంతంలో ఉన్నా, వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు.
ఎటుచూసినా రమణీయత, పచ్చని చెట్లు మరోపక్క ఆకట్టుకుంటున్న పచ్చని కొండలు, అమ్మవారి ఆలయం దిగువున నదీతీరం ఇలా ఆలయం చుట్టూ ఆహ్లాదకరంగా ఉంటుంది. అమ్మవారి ఆలయానికి వెళ్లాలంటే దాదాపుగా మొత్తం ప్రయాణమంతా అటవీ మార్గంలోనే ఉంటుంది. రోడ్డుకు ఇరువైపు ఎతైనా భారీ చెట్లు, ఎటు చూసిన అటవీ ప్రాంతం ఉంటుంది. గండి పోచమ్మ తల్లి దర్శన ప్రయాణమంటే పూర్తిగా ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. అయితే భారీ వర్షాలు, వరదల సమయంలో మాత్రం ఈ ఆలయానికి వెళ్లే వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తుగా ఏజెన్సీ ప్రాంతం ఏ విధంగా ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది. స్థానికుల సహకారం తీసుకుంటే మంచిది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం