Devineni Avinash : వాళ్ల మాదిరిగా నేను పారిపోయే రకం కాదు... మా బ్లడ్ లోనే ధైర్యం ఉంది - దేవినేని అవినాష్
తప్పుడు కేసులకు భయపడి పారిపోయే ప్రసక్తే లేదని వైసీపీ నేత దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. మీడియాలో ప్రసారమైన వార్తలను తీవ్రంగా ఖండించారు. ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం తనకు లేదన్నారు.టీడీపీ సోషల్ మీడియా చేసే ప్రచారాలను రాష్ట్ర ప్రజలేవరు నమ్మవద్దని కోరారు.
విదేశాలకు పారిపోయేందుకు యత్నించారంటూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత దేవినేని అవినాష్ స్పందించారు. తనపై మీడియాలో వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండించారు. పని పాట లేని కొన్ని మీడియా ఛానల్స్ తో పాటు టీడీపీ సోషల్ మీడియా వాళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారిపోవాల్సిన అవసరం తనకు లేదని అవినాష్ స్పష్టం చేశారు. దేవినేని బ్లడ్ లోనే ధైర్యం ఉందన్న ఆయన… రెండు నెలలుగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు తన కార్యాలయంలో అందుబాటులోనే ఉంటున్నానని చెప్పుకొచ్చారు.
“నేను తప్పు చేశానని కోర్టు తీర్పు ఇస్తే దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పుడు కేసులకు భయపడి పారిపోయే ప్రసక్తే లేదు. తన తండ్రి నెహ్రూ గారు ధైర్యంగా ఎలా ఉండాలో నాకు నేర్పించారు. టిడిపి నేతలు కార్యకర్తలు లాగా పారిపోయే మనస్తత్వం నాది కాదు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తా” అని అవినాష్ చెప్పుకొచ్చారు.
వైసీపీ కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తానని అవినాష్ ప్రకటించారు. పని పాట లేని టీడీపీ సోషల్ మీడియా చేసే ప్రచారాలను రాష్ట్ర ప్రజలేవరు నమ్మవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
“మా కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నాను. తప్పు చేస్తే శిక్షకు సిద్ధంగా ఉంటా. తప్పుడు కేసులకు భయపడే రకం కాదు. 2019లో చంద్రబాబు డ్రోన్ కేసు, గురుజాలలో కార్యకర్తల పరామర్శ, ఛలో ఆత్మకూరు ఘటనలో మిగిలిన టీడీపీ నేతల లాగా నేను పారిపోలేదు. దమ్ము ధైర్యంతోనే ముందుకు వెళ్లా. నా గురించి తెలుగుదేశం పార్టీ నేతలకు బాగా తెలుసు, మా తండ్రి దేవినేని రాజశేఖర్ గారు మాకు జన్మనివ్వటమే కాదు ధైర్యంగా ఎలా ఉండాలో కూడా నేర్పించారు” అంటూ అవినాష్ బదులిచ్చారు.
మీడియాలో కథనాలు…!
వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారంటూ ఉదయం నుంచి మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. గురువారం రాత్రి శంషాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు అవినాష్ ప్రయత్నించారని…. ఇమ్మిగ్రేషన్ సమయంలో అవినాష్‌పై లుకౌట్ నోటీసులు ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు అవినాష్ విదేశీ ప్రయాణాన్ని అడ్డుకున్నారని ఇందులో పేర్కొన్నారు.
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై జరిగి దాడి ఘటనల్లో దేవినేని అవినాష్‌పై కేసులు నమోదయ్యాయి. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అవినాష్ నిందితుడిగా ఉన్నారు. మూడేళ్ల క్రితం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విధ్వంసంలో అవినాష్ నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేశారు.
తాజాగా ఆయన దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. దుబాయ్ పారిపోయే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడ నియోజక వర్గంలో అవినాష్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ హయంలో టీడీపీ నేతలపై దూకుడుగా వ్యవహరించారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో దేవినేని అవినాష్ ప్రధాన పాత్ర పోషించారనే అనుమానాలు ఉన్నాయి.
తాజాగా లుకౌట్ నోటీసులతో దేవినేని అవినాష్ విదేశీ పర్యటనను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనలో పలువురు నేతలు ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు.
మీడియాలో ప్రసారమైన కథనాలపై అవినాష్ స్పందిస్తూ వీడియోను రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన ఎక్కడికి పారిపోలేదని… టీడీపీ సోషల్ మీడియాతో పాటు పలు మీడియా ఛానెల్స్ లోప్రసారమైన కథనాలను నమ్మవద్దని కోరారు.