Devaragattu Fight : దేవరగట్టు కర్రల సమరం.. ఐదు చుక్కల రక్తం ఎందుకు చిందిస్తారు?-devaragattu karrala samaram 2022 history of vijayadashami devaragattu bunny festival
Telugu News  /  Andhra Pradesh  /  Devaragattu Karrala Samaram 2022 History Of Vijayadashami Devaragattu Bunny Festival
దేవరగట్టు కర్రల సమరం
దేవరగట్టు కర్రల సమరం (twitter)

Devaragattu Fight : దేవరగట్టు కర్రల సమరం.. ఐదు చుక్కల రక్తం ఎందుకు చిందిస్తారు?

04 October 2022, 20:01 ISTAnand Sai
04 October 2022, 20:01 IST

Devaragattu Bunny Festival : దసరా వచ్చిందంటే దేవరగట్టు.. కర్రల సమరానికి సిద్ధమవుతోంది. ప్రతీ ఏటా నిర్వహించే ఈ వేడుకకు చాలా ప్రాధాన్యత ఉంది. అక్కడకు వెళితే పగిలిన తలలు.. కారుతున్న రక్తం కనిపిస్తుంది. ఇంతకీ కర్రల సమరం జరగడం వెనక ఉన్న కథేంటి? తలలు పగులుతున్నా.. కర్రల సమరాన్ని ఎందుకు నిర్వహిస్తారు?

కర్రల సమరానికి(Karrala Samaram) కర్నూలు జిల్లా దేవరగట్టు(Devaragattu) సిద్ధమైంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా కర్రల సమరం జరుగుతోంది. దీనినే బన్నీ ఉత్సవం(Bunny Festival) అని కూడా అంటారు. విజయదశమి పండుగ నాడు అర్ధరాత్రి ఈ ఉత్సవం జరుగుతుంది. మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించిన అనంతరం.. కర్రల సమరం జరపడం ఇక్కడ ఆనవాయితీ. ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. కర్ణాటక(Karnataka), తెలంగాణ(Telangana) రాష్ట్రాల భక్తులు భారీగా తరలివస్తారు. అసలు ఇక్కడ కర్రల సమరం జరపడం వెనక ఉన్న కథ ఏంటి?

త్రేతాయుగంలో సముద్ర మట్టనికి సుమారు 2000 వేల అడుగులు ఎత్తున ఉన్న దేవరగట్టు అటవీప్రాంతంలో లోకకల్యాణం కోసం మునులు తపస్సు చేయాలనుకున్నారట. ప్రతి రోజు కొండ గుహల్లో తపస్సుకు వెళ్లేవారు. వారి తపస్సుకు రాక్షసులు భంగం కలిగించేవారు. లోక కళ్యాణం(Loka Kalyanam) కోసం తపస్సు చేస్తుంటే ఇద్దరు రాక్షసులు తప్పసుకు భంగం కలిగిస్తున్నారని పార్వతీ పరమేశ్వరులకు మునులు చెప్పుకొన్నారు. వారిద్దరూ.. కూర్మ అవతరంలో కొండ గుహలో స్వయంభువుగా వెలసి రాక్షసుల నీడను గమనిస్తూ దేవరగట్టు వచ్చినట్లు కథ ప్రచారంలో ఉంది.

పార్వతీ పరమేశ్వరులే మాత మాళమ్మ, మల్లేశ్వరులు అని చెబుతుంటారు. దేవరగట్టు పైకి వచ్చిన తర్వాత వేలాదిమంది జనంతో రాక్షస సంహారానికి మల్లేశ్వర స్వామి వెళ్తారు. సంహారానికి ముందు మీ చివరి కోరిక ఏంటి అని రాక్షసులకు ప్రశ్న వేస్తారు. నరబలి కావాలని రాక్షసులు అడగ్గా.. అలా కుదరదని చెప్పి ఐదు చుక్కల రక్తం గురవయ్య ఇచ్చినట్టుగా చెబుతుంటారు. ఆ తర్వాత రాక్షస సంహారం జరుగుతుంది. ఆ ఐదు చుక్కల రక్తమే ప్రతిసారి కర్రల సమరం(Karrala Samaram)లో రక్తం చిందడంగా ఆనవాయితీగా మారింది.

ఉత్సవ విగ్రహాలు రక్షపడికి చేరాక.. రెండు రాతి గుండ్లకు కంచాభీరా వంశానికి చెందిన గొరువయ్య ఐదు చుక్కల రక్తాన్ని సమర్పిస్తాడు. కాలిపిక్కలో దబ్బణంతో ఒకవైపు నుంచి మరోవైపు లాగుతాడు. వచ్చే రక్తాన్ని రాతి గుండ్లకు విసురుతుంటారు. ఉదయంలోపు రక్తపు మరకలను రాక్షసులు సేవిస్తారని నమ్ముతుంటారు.

దేవరగట్టు(Devaragattu)కు ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా పాల్గొనేది మాత్రం.. చుట్టూ ఉన్న గ్రామాలే. దేవరగట్టు పరిసర గ్రామాలు నెరనికి, నెరనికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట వద్దకు చేరి బన్నీ ఉత్సవాన్ని(Bunny Festival 2022) ఘనంగా నిర్వహిస్తారు. మాతమాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవం చేస్తారు. ఆ తర్వాత కర్రల సమరం ఉంటుంది. గాయపడినవారికి స్వామివారికి చల్లే పసుపు పెడతారు. అలా చేస్తే.. తగ్గిపోతుందని భక్తుల నమ్మకం.

ప్రతీ ఏటా బన్నీ ఉత్సవాలకు పోలీసులు(Police) భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా 1000కిపై పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు. అక్టోబర్ 5వ తేదీన బుధవారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. తర్వాత జైత్రయాత్ర మొదలువుతుంది. 6వ తేదీన ఆలయ పూజారి భవిష్యవాణి వినిపిస్తారు. 7వ తేదీన రథోత్సవం నిర్వహిస్తారు. 8న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన చేస్తారు. 9న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరుతాయి. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి.