Pawan Kalyan : వైసీపీకి 11 సీట్లు వచ్చినా అహంకారం చావలేదు, అధికారులపై దాడులు చేస్తే కఠిన చర్యలు- పవన్ కల్యాణ్
Pawan Kalyan : వైసీపీకి 11 సీట్లు వచ్చినా ఇంకా ఆ పార్టీ నాయకులు గాల్లో విహరిస్తున్నారని, ఎలా కిందకి దించాలో తమకు బాగా తెలుసని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అహంకారంతో అధికారులపై దాడులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Pawan Kalyan : కడప జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడిలో గాయపడి కడప రిమ్స ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ పరామర్శించారు. అండగా ఉంటానని వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. జవహర్ బాబు ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతోమాట్లాడూ... 'ఈ దాడి ఒక్కరి మీద జరిగినట్టు కాదు. రాష్ట్ర యంత్రాంగంపై జరిగిన దాడిగా చూస్తున్నాం. వైసీపీని 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా అహంకారం చావలేదు. మీ అహంకారం తగ్గే వరకు మిమ్మల్ని వదలం' అన్నారు.
విధి నిర్వహణలో ఉన్న ఏ ఉద్యోగిపై దాడికి పాల్పడినా సరే కఠిన చర్యలు తీసుకోవలసిందిగా, అదే విధంగా దాడికి పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న మిగతా 9 మందిని త్వరగా అరెస్టు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఎంపీడీఓను ఓ గదిలో బంధించి అమానుషంగా దాడి చేశారన్నారు. ఎస్సీ కులానికి చెందిన ఆయనను కులం పేరుతో దూషించారని, వారి కుటుంబం నేటికి దాడులకు భయపడి బిక్కు బిక్కుమని బతుకుతున్నారన్నారు.
"రాయలసీమ యువతకి చెప్తున్నా, మీ ప్రాంతంలో ఆధిపత్యపు అహంకారంతో జరుగుతున్న దాడులను ఎదుర్కోవాలి. మేము మీకు అండగా ఉంటాం. ఇలా భయపడే ఇవాళ ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబుపై దాడి చేసి కులం పేరుతో దూషించే స్థితికి తీసుకొచ్చారు. దీనికి ప్రజలు కూడా స్పందించాలి. ఎంపీడీఓ అంటే ఒక మండలానికి ఉన్నత అధికారి, అలాంటి వ్యక్తిని బూతులు తిడుతూ కులం పేరు మీద దూషిస్తూ ఇదొక పరిపాటి అయిపోయింది. ముఖ్యంగా రాయలసీమలో ఎక్కడైతే ఇలాంటి ధోరణి ఉందో అక్కడ అందరూ సమిష్టిగా ఎదురు తిరగాలని కోరుకుంటున్నాను"- పవన్ కల్యాణ్
దాడులను ఉపేక్షించే ప్రభుత్వం కాదు
'మేము నిస్సహాయత ఉండేవాళ్లం, ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్లం, మాకు భయమేస్తుంది' అని జవహర్ బాబు భార్య అంటుంటే తాను ఒకటే చెప్పానని,
కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, జిల్లాకి సంబంధించిన నాయకులు సమక్షంలో... అందరి తరపునా వారి కుటుంబానికి భరోసా ఇస్తున్నామన్నారు. దాడికి పాల్పడి తప్పించుకున్న 9 మందిని వెంటనే పట్టుకోమని, తగిన విధంగా చర్యలు తీసుకోమని ఎస్పీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ దాడి చేసినవారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు. ఏ నాయకుడైనా అధికారులపై దాడి చేసినా, అన్యాయంగా వారి విధులను అడ్డుకున్నా కఠినమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఎవ్వరైనా సరే ఆధిపత్య ధోరణితో దాడి చేస్తే ఉపేక్షించే ప్రభుత్వం కాదన్నారు.
“గాల్లో విహరిస్తూ ఉన్నారు, ఎలా చేస్తే కిందకొస్తారో మేము చేసి చూపిస్తాం. 11 సీట్లు వచ్చినా ఇంకా గాల్లో విహరిస్తున్నారు, ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. అహంకారంతో అధికారులపై దాడులు చేస్తే మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో కచ్చితంగా ఇస్తాం. ఇష్టారాజ్యంగా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కినట్టు ప్రవర్తించకండి. ఇష్టా రాజ్యంగా ప్రవర్తిస్తాం అంటే చూస్తూ కూర్చోడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం”-పవన్ కల్యాణ్
అల్లు అర్జున్ అరెస్ట్ పై
అల్లు అర్జున్ అరెస్టుపై ఎదురైన ప్రశ్నకు పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ అరాచకం జరుగుతుంటే సినిమాల ప్రస్తావన ఎందుకన్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులు ఓజీ ఓజీ అని కేకలు వేయడంతో వారిపై పవన్ చిరాకు పడ్డారు. ఏంటయ్య మీరు, ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి అంటూ అసహనం వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం