ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఎలక్ట్రీషియన్ల ప్రాణాలకు రక్షణ కల్పించేలా సేఫ్టీ కిట్స్ అందజేశారు. ఇందుకోసం ఇవాళ మధ్యాహ్నం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న 325 మంది ఎలక్ట్రీషియన్లకు సెఫ్టీ కిట్స్ పంపిణీ చేశారు.పని ప్రదేశాల్లో వినియోగించాల్సిన రక్షణ పరికరాలను, టూల్ కిట్లను అందించారు.
ఇటీవల పిఠాపురంలో ఒక ఎలక్ట్రీషియన్ పని చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తో మృతి చెందారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్…. భవిష్యత్తులో మరొకరి ప్రాణాలు పోకూడదనే ఉద్దేశంతో ఈ కిట్లను అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… గత ఏప్రిల్ నెలలో పిఠాపురం నియోజక వర్గంలోని మల్లం గ్రామంలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. “ఎలక్ట్రీషియన్ పనులు చేసి జీవించే 38 ఏళ్ల పల్లపు సురేష్ బాబు దురదృష్టవశాత్తు ఒకరి ఇంటిలో కరెంటు మరమ్మత్తు పని చేస్తూ విద్యుధాఘాతానికి గురై మృతి చెందాడు. సురేష్ బాబు మృతితో అతని కుటుంబం పోషకుడిని కోల్పోయింది. నిరాధారంగా మారడమే కాకుండా… ఈ సంఘటన గ్రామంలో సాంఘికంగా అవాంఛనీయమైన అపోహలకు, స్పర్థలకు దారి తీసింది”అని చెప్పారు.
“ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే, రెండు అంశాలు మనకు స్పష్టం అవుతున్నాయి. ఒకటి పేదరికం కారణంగా సురేష్ బాబుకు విద్యుత్ పనులు చేసేపుడు వాడే రక్షణ పరికరాల లేక పోవడం. రెండవది ప్రమాదవశాత్తు అతడు చనిపోతే అతని కుటుంబానికి ఆదుకునేందుకు ఆర్థిక భద్రత లేకపోవడం. అందుకే ఇటువంటి సంఘటన పునరావృతం కాకూడదనే నిశ్చయంతో పిఠాపురం నియోజకవర్గంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్న కార్మికులందరికి రక్షణ, భద్రత కల్పించాలని” నిశ్చయించుకున్నాని పవన్ వెల్లడించారు.
ఇందులో భాగంగా పిఠాపురం నియోజక వర్గంలో పనిచేస్తున్న 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు కిట్స్ అందజేస్తారు. ఈ కిట్ లో ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్స్ కిట్, రబ్బర్ హాండ్ గ్లోవ్స్, సేఫ్టీ షూస్, జాకెట్ ఉన్నాయి.
ఈ 325 మంది ప్రయివేట్ ఎలక్ట్రీషియన్లను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న ఈ-శ్రమ్ సంక్షేమ పోర్టల్ లో నమోదు చేసి యూఏఎన్ నెంబర్ జారీ చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ చెప్పారు. కార్మికుడు ప్రమాద వశాత్తు మరణించినా లేదా పూర్తి అంగవైకల్యం సంభవిస్తే 2 లక్షల రూపాయలు, పాక్షిక వైకల్యం సంభవిస్తే లక్షరూపాయాలు ఎక్సేగ్రేషియా అతని కుటుంబానికి చెల్లించి ఆర్ధికంగా ఆదుకోనున్నట్లు తెలిపారు.
కరెంటు పనులు చేసేటప్పుడు ఈ రక్షణ పరికరాలను తప్పని సరిగా వాడాలని ఎలక్ట్రీషియన్లను పవన్ ప్రత్యేకంగా కోరారు. అలాగే వాటి ఎలా వినియోగించాలో, విద్యుత్ పనులు చేసేపుడు పాటించవలసిన జాగ్రత్తలపై ఎలక్ట్రీషియన్లకు ఓరియెంటేషన్ నిర్వహించాలని విద్యుత్ శాఖ ఇంజనీర్లను కోరారు.