Pawan Kalyan : సర్పంచులకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్.. త్వరలో అకౌంట్లలోకి డబ్బులు-deputy cm pawan kalyan meets with sarpanches in amaravati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : సర్పంచులకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్.. త్వరలో అకౌంట్లలోకి డబ్బులు

Pawan Kalyan : సర్పంచులకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్.. త్వరలో అకౌంట్లలోకి డబ్బులు

Basani Shiva Kumar HT Telugu
Nov 07, 2024 02:28 PM IST

Pawan Kalyan : నిధుల కొరతతో సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం సిబ్బంది జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి శుభవార్త చెప్పారు. త్వరలోనే గ్రామ పంచాయతీల ఖాతాల్లో డబ్బులు పడతాయని స్పష్టం చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

సర్పంచ్‌లతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్‌శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ భేటీలో మొత్తం 16 అంశాలను సర్పంచ్‌లు పవన్‌ ముందు ఉంచారు. రాజధానిలో భవన నిర్మాణం కోసం.. రెండు ఎకరాల స్థలం అడిగారు. వారి విజ్ఞప్తిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.

'ప్రభుత్వం నిధులు ఆపడం లేదు. 15 ఫైనాన్స్ డబ్బులు త్వరలో అకౌంట్లలో జమ అవుతాయి. గ్రామీణ అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రం కట్టుబడి ఉంది. గత ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసింది. జీతాలు పెంచాలని జీవోలో ఎక్కడా లేదు. పార్టీల పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ.. అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

'వైసీపీ గ్రామ వాలంటీర్లను దారుణంగా మోసం చేసి పెట్టుకుంది. గ్రామ వాలంటీర్లకు ఇచ్చిన మాట నిరవేరుద్దాం అని చూస్తుంటే ఎక్కడా జీవోలో వాళ్లు లేరు. ఉద్యోగాలే కావు అవి. ఇదొక సాంకేతిక సమస్యగా అయిపోయింది. ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిరవేర్చడంతో పాటు, అన్ని వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. కీలకమైన పంచాయితీరాజ్ శాఖని మరింత బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

'15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 750 కోట్ల రూపాయలు 30,000 పనులకి గాను ఇంకో నెల రోజుల్లో విడుదలవుతాయి. గత ప్రభుత్వం మళ్లించిన నిధులు ఒకటి రావాలి. ఇప్పటికైతే రావల్సిన నిధులు మన ప్రభుత్వం ఎక్కడా ఆపట్లేదు. గత ప్రభుత్వం 12,900 గ్రామ పంచాయితీల్లోని 8,629 కోట్ల రూపాయల నిధులు వాడేసుకున్నారు. తిరిగి వాటిని జమ చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని కేబినెట్లో చర్చిస్తాను' అని పవన్ హామీ ఇచ్చారు.

'ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పంచాయితీరాజ్ శాఖ భవన నిర్మాణం కోసం కేటాయించామని కోరారు. మీరు ఇది చెప్పకముందే ఈ ఆలోచనలో ఉన్నాం. కచ్చితంగా ముందుకు తీసుకెళతాం. కేవలం రెండు ఎకరాలు సరిపోతదా.. ట్రైనింగ్ సెంటర్‌తో కలిపి ఇంకొంచెం పెద్దగా నిర్మించాలా అనేది పరిశీలిస్తాం' అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Whats_app_banner