మీ సేవలు ప్రశంసనీయం.. నర్సులను సన్మానించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్-deputy cm pawan kalyan honours nurses from pithapuram constituency ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మీ సేవలు ప్రశంసనీయం.. నర్సులను సన్మానించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

మీ సేవలు ప్రశంసనీయం.. నర్సులను సన్మానించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

వైద్య రంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయం అని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా.. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో పవన్ భేటీ అయ్యారు. ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మందిని సన్మానించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నర్సులతో పవన్ కళ్యాణ్ (JSP)

వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ స్ఫూర్తితో.. రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని కొనియాడారు. నిస్వార్ధంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, సాంత్వన కలిగిస్తుందని చెప్పారు.

నర్సులతో సమావేశం..

అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో.. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న స్టాఫ్ నర్సులతో పవన్ సమావేశం అయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రశంసనీయ సేవలు అందించిన ఎనిమిది మంది స్టాఫ్ నర్సులను సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

మీ కష్టం గుర్తొచ్చింది..

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరు. మీరు పడే శ్రమ, కష్టం నాకు తెలుసు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీరు విధులు నిర్వర్తించిన విధానం మరువలేం. ఇటీవల సింగపూర్‌లో నా కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు.. ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి మీ కష్టం గుర్తుకువచ్చింది' అని పవన్ వ్యాఖ్యానించారు.

మీ సేవలు మర్చిపోలేం..

'మిమ్మల్ని కలసి మీరు అందించే సేవలు మరచిపోలేనివి అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మిమ్మల్ని కలిసే అవకాశం రావడం ఆనందాన్నిచ్చింది. నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తా' అని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

సత్యకుమార్ శుభాకాంక్షలు..

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా పోస్టు చేశారు. నర్సుల వృత్తికి గౌరవాన్ని, ఖ్యాతిని తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజారోగ్య సంరక్షణలో నర్సుల కృషి, సేవ అమోఘమని కొనియాడారు. పేషంట్లను సొంత మనిషిలా చూసుకుంటూ.. అవసరమైన చికిత్సలో ఆసరాగా నిలుస్తున్న నర్సులు.. చిరునవ్వుతో, మానవత్వంతో సేవలందించే ప్రతి నర్సుకీ హృదయపూర్వక వందనాలు.. అని సత్యకుమార్ ట్వీట్ చేశారు.

సంబంధిత కథనం