MPDO Missing Mystery: నరసాపురం ఎంపీడీవో అదృశ్యం వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. ఫెర్రీ నిర్వహణ బకాయిల వ్యవహారంలో ఎంపీడీఓ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకుంటానంటూ అదృశ్యం కావడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిప్యూటీ సిఎం పవన్ ఆదేశించడంతో మాజీ ఎమ్మెల్యేతో పాటు ఫెర్రీ నిర్వాహకుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
నరసాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమ్. వెంకటరమణారావు అదృశ్యం, అందుకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఆదేశించారు.
అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకుంటానంటూ వెంకట రమణారావు రాసిన లేఖ, అందులోని వివరాల గురించి ఆరా తీశారు. నరసాపురం ఫెర్రీ కాంట్రాక్టర్ బకాయిలు అంశాన్ని లేఖలో ప్రస్తావించిన విషయాన్ని అధికారులు ఉప ముఖమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
రాష్ట్రంలో ఫెర్రీ బకాయిల వివరాలు, బకాయిలుపెడుతున్నవారి వివరాలను తక్షణమే తయారు చేయాలని పవన్ అధికారుల్ని ఆదేశించారు. ఎంపీడీఓ స్థాయి అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ జూలై 15 నుంచి కనిపంచకుండా పోయారు. ఏలూరు కాల్వలో వెంకటరమణ దూకి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొబైల్ సిగ్నల్‌ను ట్రాక్ చేయడంతో విజయవాడలోని మధురానగర్ ఏలూరు కాల్వ వద్ద సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించారు. దీంతో రెండ్రోజులుగా కాల్వలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
వెంకటరమణారావు విజయవాడ కానూరు మహదేవపురం కాలనీలో ఉంటున్నారు. నరసాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో ఇంటికి వచ్చేవారు. జూలై 10 నుంచి 20వ తేదీ వరకు సెలవుపై కానూరు వచ్చారు. 15న మచిలీపట్నం వెళుతున్నానని ఇంటి నుంచి వెళ్లారు. అదే రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి, తాను బందరులో ఉన్నానని, రావడానికి ఆలస్యమవుతుందని భార్యతో చెప్పారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత 'తన పుట్టిన రోజైన 16వ తేదీయే.. చనిపోయే రోజు కూడా. ..అందరూ జాగ్రత్త' అని భార్య ఫోన్‌కు మెసేజ్ పంపించారు. దీంతో కుటుంబసభ్యులు మంగళవారం ఉదయం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు రమణారావు వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించారు. మచిలీపట్నం నుంచి రైల్లో విజయవాడ మధురానగర్ చేరుకుని ఉంటారని పోలీసులు అనుమానించారు.
నరసాపురంలోని మాధవాయిపాలెం పెర్రీ రేవును వేలం పాడుకున్న పాటదారు రూ.లక్షల్లో ప్రభుత్వానికి బకాయి పడ్డాడు. మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ప్రసాదరాజు ఒత్తిడితో డబ్బులు వసూలు కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. నరసాపురం పట్టణంలో ఉన్న రేవు నుంచి పంటు నిర్వహించే వారు. దీనిలో నరసాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండల పరిషత్తులకు భాగస్వామ్యంలో నరసాపురం అధికారులు నిర్వహించేవారు.
ఎన్నికల కోడ్ తర్వాత ఈ రేవు నిర్వహణకు వేలం జరగలేదు. ఏప్రిల్ 1 నుంచి రేవు నిర్వహణను రోజుకు లక్ష చెల్లించేలా పాటదారుకు కేటాయించారు. తర్వాత దానిని రూ. 75వేలకు తగ్గించారు. జూలై 3వరకు నిర్వహణకు సంబంధించిన నగదును పాటదారుడు ప్రభుత్వానికి జమ చేయలేదు. దీంతో ఉన్నతాధికారులు ఎంపీడీవోపై ఒత్తిడి పెంచారు. మాజీ విప్ ప్రసాదరాజు ఇబ్బంది పెడుతున్నట్లు వాట్సప్‌లో వెంకటరమణ రాసిన లేఖలో పేర్కొన్నారు.
నరసాపురం ఫెర్రీ కాంట్రాక్టర్ ఎగవేతపై డిప్యూటీ సిఎం పవన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే నాయకర్ సాయాన్ని ఎంపీడీవో కోరినట్టు తెలుస్తోంది. ఈలోపు ఒత్తిడి పెరగడంతో ఆయన అదృశ్యమయ్యారు. ‘’కాట్రాక్టర్‌ను బకాయిలు చెల్లించాలని అడిగితే బెదిరిస్తున్నారని, రూ.55లక్షలు ఫెర్రీ లీజు బకాయిలు ఉన్నారని, మాజీ చీఫ్ విప్ ప్రసాదరాజు అండదండలతో నిందితులు డబ్బులు చెల్లించలేదని లేఖలో పేర్కొన్నారు. మూడున్నర నెలల నుంచి నిందితులు ఇబ్బంది పెడుతున్నారని ఏ తప్పు చే
యకపోయినా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు రికవరీ చేయకపోవడానికి తనను బాధ్యుడిని చేసే అవకాశం ఉందని ఆందోళనకు గురయ్యారు. ఉద్యోగమే తనకు జీవనాధారమని నిందితులు బకాయి డబ్బు చెల్లించేలా చూసి న్యాయం చేయాలని ఎంపీడీవో వెంకటరమణ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇటీవల లేఖ రాశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేయాలని పవన్ అధికారుల్ని ఆదేశించారు.